
ఆటోనగర్ (విజయవాడ తూర్పు)/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో రెండు సార్లు సీఎంగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని సినీ నటుడు సుమన్ అన్నారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఒకరే ఉండేలా ప్రజలు అవకాశం ఇస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సోమవారం విజయవాడలోని జవహర్ ఆటోనగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపు సాక్షితో మాట్లాడారు.
గత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాలతో పేదల్లో చిరునవ్వును నింపిందని చెప్పారు. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. సినిమాల్లోకి వెళ్లాలని ఓ మెకానిక్ సలహా ఇవ్వడంతోనే తాను ఈ రంగానికి వచ్చానని, అందుకే మెకానిక్‌లంటే తనకు అభిమానమని తెలిపారు. ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్ కలాం తన మంచి మిత్రుడని పేర్కొన్నారు.
బయ్యర్లు బాగుంటేనే..
సినిమా పరిశ్రమ బాగుండాలని ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువే చేసిందని సుమన్ అన్నారు. బయ్యర్లు బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో ‘పల్లె గూటికి పండుగొచ్చింది’ ఆడియో విడుదల చేసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చేసిన దానికి తామంతా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇంకా చేయగలిగినంత చేస్తామని సీఎం చెప్పారని, ఏపీలో స్టూడియోలు స్థాపించాలని కోరారని అన్నారు. రాష్ట్రంలో మంచి షూటింగ్ స్పాట్‌లు ఉన్నాయని చెప్పారు.