
ఎన్టీఆర్ జిల్లాలో హల్‌చల్
కంచికచర్ల (నందిగామ): ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, పరిటాలలో 52 క్యారెట్ల వజ్రం దొరికిందన్న వార్త ఆదివారం వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేసింది. దీని ప్రకారం– పరిటాల చెరువు వద్ద వజ్రాల వేటకు వచ్చిన ఓ వ్యక్తికి ఈ భారీ వజ్రం దొరికిందట. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.4 కోట్లు ఉంటుందని, కానీ సదరు వ్యక్తి రూ.2.20 కోట్లకే అమ్మేశాడని ప్రచారం జరిగింది.
స్వాతంత్య్రం రాకముందు ఈ ప్రాంతం నిజాం నవాబుల పాలనలో ఉండేదని, అప్పట్లో వజ్రాలు, వైఢూర్యాలు ఇక్కడ విరివిగా లభించేవని ఇక్కడ వినిపిస్తుంటుంది. అయితే, తాజాగా వజ్రం దొరికిందన్న వార్త పూర్తిగా కల్పితమని, తమకు ఎటువంటి సమాచారం లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. చెరువు కూడా ప్రస్తుతం నీటితో నిండిపోయి ఉండడంతో, వజ్రాల వేట అసాధ్యమని వారు చెబుతున్నారు.