Andhra Pradesh: రూ.2,134 కోట్లతో 5 కొత్త పరిశ్రమలు

5 new industries will be set up with Rs.2,134 crore In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.2,134 కోట్ల పెట్టుబడులతో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 8,578 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. కంపెనీల విస్తరణకు అవకాశాలున్న చోట భూములు కేటాయించాలని సూచించారు. భవిష్యత్తులో పరిశ్రమలను విస్తరించేందుకు అనువుగా తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.అనంతరాము, జీఏడీ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్‌ కుమార్, ఐటీ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌ తదితరులు పాల్గొన్నారు. 

కొత్తగా ఏర్పాటయ్యే ఐదు పరిశ్రమలు ఇవీ 
► వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌– రిటైల్‌ లిమిటెడ్‌ ఏర్పాటు కానుంది. ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్నారు. ఆదిత్యా బిర్లా రూ.110 కోట్ల పెట్టుబడితో 2,112 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. 
► వైఎస్సార్‌  జిల్లా బద్వేలులో సెంచురీ కంపెనీ ప్లైవుడ్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. రూ.956 కోట్ల పెట్టుబడితో 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. మరోవైపు ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల రైతులకు కూడా భారీగా మేలు జరగనుంది. దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్‌ చెట్లను గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. రూ.315 కోట్ల విలువైన ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు.
► తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.861 కోట్ల పెట్టుబడితో ఇక్కడ 1,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. స్థానిక ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను నెలకొల్పబోమని గ్రాసిమ్‌ కంపెనీ స్పష్టం చేసింది. ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని విరమించుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు కంపెనీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఎస్‌ఐపీబీ ఆమోదం లభించింది. 
► వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల (హెచ్‌ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్‌) తయారీ పరిశ్రమను ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నెలకొల్పనుంది. రూ.127 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1,800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 
► కొప్పర్తి ఈఎంసీలోనే ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరో పరిశ్రమను కూడా ఏర్పాటు చేయనుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరా, డీవీఆర్‌ తయారీకి సంబంధించి రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,100 మందికి డిక్సన్‌ కంపెనీ ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top