వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలు
కలుషిత ఆహారం వల్లే అనారోగ్యం
పెదబయలు ఏకలవ్య పాఠశాలలో ఘటన
పెదబయలు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రభుత్వ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పెదబయలులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి వడ్డించిన ఆహారం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడడంతో పాఠశాలలో ఆందోళన నెలకొంది. ఈ పాఠశాలలో మొత్తం 280 మంది విద్యార్థులు చదువుతున్నారు.
సోమవారం రాత్రి విద్యార్థులకు క్యాబేజీ, పప్పు కూరతో భోజనం వడ్డించారు. అది తిన్న విద్యార్థులకు అర్ధరాత్రి నుంచే వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. మంగళవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో విద్యార్థులు పాఠశాల ఏఎన్‌ఎంకు ఫిర్యాదు చేశారు. పాఠశాల సిబ్బంది వెంటనే పాఠశాల వాహనంలో విద్యార్థులను పెదబయలు పీహెచ్‌సీకి తరలించింది. ఏడో తరగతి విద్యార్థి పి.పుష్కల, 8వ తరగతి విద్యార్థులు డి.కనకమహాలక్ష్మి, కె.భార్గవి, బి.ఇవాంతి, 9వ తరగతి విద్యార్థులు పి.రాహుల్, ఎన్.మధుప్రియ, పి.జషీక, కె.వరహాలమ్మ, పి.మేఘన, బి.విజయవిజ్ఞాన్తోపాటు మరో విద్యార్థి అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో ఎన్.మధుప్రియ, కె.భార్గవి, కె.వరహాలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యాధికారులు ప్రత్యేక చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ అస్తవ్యస్తంగా ఉందని ఫిర్యాదు చేసినా మార్పు రావడం లేదని పేర్కొన్నారు. ఏటీడబ్ల్యూవో జన్ని జగత్‌రాయ్, ఎంఈవో కృష్ణమూర్తి పాఠశాలను సందర్శించారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు.


