సీబీఎస్‌ఈకి 1,092 స్కూళ్లు ఎంపిక

1,092 schools selected for CBSE - Sakshi

ప్రభుత్వంలో 10 యాజమాన్యాల పరిధిలో స్కూళ్ల ఎంపిక

అత్యధికంగా కేజీబీవీలకు ప్రాధాన్యం

అనంతపురం జిల్లాలో అత్యధికంగా 137 స్కూళ్లు

వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ అమలు

ఏర్పాట్లను ముమ్మరం చేసిన విద్యా శాఖ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు తెస్తున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా వ్యవస్థలో ముఖ్యంగా మూల్యాంకన విధానంలో పూర్తి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దే ఉద్దేశంతో సీబీఎస్‌ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ముందుగా సీబీఎస్‌ఈకి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా సుముఖత వ్యక్తపరిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న 1,092 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి దశ కింద వీటిలో సీబీఎస్‌ఈ అమలుకు నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రాసేలా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏడో తరగతి నుంచి అమలు చేయాలని ముందు నిర్ణయించారు. అయితే సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండడం, ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడచిపోతుండడంతో వచ్చే ఏడాది నుంచి అంటే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 

కేజీబీవీలకు అగ్రస్థానం
తొలి విడతగా సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వంలోని 10 విభాగాల యాజమాన్యాల పరిధిలో ఉన్న వివిధ స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో నిరుపేద, అనాధ బాలికలు విద్యనభ్యసిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత ఏపీ మోడల్‌ స్కూళ్లు, వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే గురుకుల స్కూళ్లు, మున్సిపల్‌ స్కూళ్లు, జెడ్పీ, ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేశారు. 

అత్యధికంగా అనంతపురం జిల్లాలో..
సీబీఎస్‌ఈ విధానం తొలి విడత అమలుకు సంబంధించి ఎంపిక చేసిన స్కూళ్లలో అత్యధికం అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో 137 స్కూళ్లను ఎంపిక చేయగా రెండో స్థానంలో కర్నూలు (128) మూడో స్థానంలో ప్రకాశం (94) ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top