ఎన్‌పీకుంట: మండల పరిధిలోని మరికొమ్మదిన్ని పంచాయతీ పరిధిలో సుమారు 600 ఎకరాలలో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (సోలార్ పవర్ ప్లాంట్) నిర్మాణం కోసం రైతులను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా భూములు లాక్కోవద్దని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి ప్రైవేటు కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయే రైతులతో గురువారం ఆయన మాట్లాడారు. అలాగే తహసీల్దార్ లక్ష్మమ్మతో సోలార్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆరా తీశారు. అనంతరం మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షుడు బాబ్జాన్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలని అంతేకానీ బలవంతంగా భూసేకరణ చేపడితే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు.


