అనంతపురం ఎడ్యుకేషన్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి సేకరిస్తున్న వ్యక్తిగత వివరాల గోప్యతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మీ వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుంది, ఎలాంటి దుర్వినియోగానికి అవకాశం ఉండదు’ అని ఎన్నికల సంఘం ఇచ్చిన హామీపై నమ్మకంతోనే ప్రజలు ఈ వివరాలను క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలకు ఇస్తున్నారు. అయితే, వివరాలను అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతినిధులు తమ పార్టీ యాప్ (మై టీడీపీ)లో నమోదు చేసేందుకు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ కోసం మాత్రమే ఇచ్చిన సమాచారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని కొందరు బీఎల్‌ఓలు వాపోతున్నారు. బెదిరింపు ధోరణిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఈ ఒత్తిళ్లు తాళలేక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కొందరు బీఎల్‌ఓలు ఈ విషయాన్ని ఆర్డీఓ రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు
సచివాలయ ఉద్యోగులు కూడా వ్యక్తిగత వివరాల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో సేకరించిన సమాచారం అనధికారికంగా బయటకు వెళితే తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందేమోనని భయపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతుల ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాల భద్రతపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఆధార్ నంబర్ అనేది ప్రతి పౌరుడి అత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారం. బ్యాంకింగ్, సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ సేవలు దాదాపు అన్నీ ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సమాచారం అనధికారికంగా ఇతరుల వద్దకు చేరితే దాని వల్ల కలిగే పరిణామాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సంఘం సేకరించే సమాచారం పూర్తిగా ఎన్నికల అవసరాలకే పరిమితమై ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రభుత్వం, ఎన్నికల అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
అనంతపురం నగరంలో ఓ కార్పొరేషన్ డైరెక్టర్ సచివాలయానికి వెళ్లి ‘ఎస్‌ఐఆర్ సర్వేలో వచ్చిన ఫొటోలు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు తనకు ఇవ్వాలని ఓ ఉద్యోగిని అడిగాడు. అలా ఇవ్వడానికి కుదరదు సర్. ఏదైనా ఉంటే మా ఉన్నతాధికారులను కలవండి’ అంటూ ఆ ఉద్యోగి చెప్పాడు. ‘నేను ఎమ్మెల్యేతోనే చెప్పిస్తానంటూ’ సదరు డైరెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఓటర్ల వివరాల కోసం అనంతపురంలోని ఓ సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేత ఒత్తిడి చేశారు. అలా సాధ్యం కాదని ఉద్యోగి తెగేసి చెప్పడంతో ‘బీఎల్‌ఓలు మాకు సహకరించడం లేదు’ అంటూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సేకరించిన సమాచారం దుర్వినియోగం
సచివాలయాల నుంచి సేకరిస్తున్న అధికార పార్టీ నేతలు
వివరాల కోసం సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు
‘మై టీడీపీ’ యాప్ లో అప్‌లోడ్
చేస్తున్నారంటూ సర్వత్రా ఆందోళన
ఆధార్, ఫోన్ నంబర్లు, ఫొటోల భద్రతపై ఓటర్లలో సందేహాలు


