కళ్యాణదుర్గం: ఉచిత బస్సు మాటేమో కానీ...ఆర్టీసీ బస్సులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోతున్నాయి. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సులు తరచూ రిపేర్లు వస్తున్నాయని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. గురువారం ఉదయం కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి వెళ్తున్న అల్ట్రా పల్లె వెలుగు బస్సు (ఏపీ39యూహెచ్ 2171) ఒంటిమిద్ది వద్ద ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరేందుకు వేరొక బస్సును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన బస్సులను కొనుగోలు చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అపోలో మెడికల్ స్టోర్‌లో చోరీ
గుంతకల్లు రూరల్: పట్టణంలోని కసాపురం రోడ్డులోని సత్యనారాయణపేట కాలనీలో సురేష్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న అపోలో మెడికల్ స్టోర్‌లో దొంగతనం జరిగింది. గురువారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో చొరబడిన దొంగలు రూ.40 వేలు అపహరించారు. నలుగురు దొంగలు షాపు షట్టర్‌ను ఎత్తి ఇద్దరు బయట కాపలా కాయగా, మరో ఇద్దరు లోపలికి వెళ్లి లాకర్‌లో ఉన్న రూ.40 వేలను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే చోరీకి పాల్పడిన నలుగురు దొంగలు ముఖాలకు మాస్కులను ధరించారు. డాగ్‌స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించాయి.
అంజనప్పకు న్యాయం చేసే దాకా పోరాటం
ఓడీచెరువు: మండలంలోని తుమ్మలకుంట్లపల్లికి చెందిన దళిత దివ్యాంగ మెగా డీఎస్సీ – 2025 అభ్యర్థి అంజనప్పకు ఉద్యోగం వచ్చేంత వరకూ పోరాటం చేస్తామని దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు తెలిపారు. మెగా డీఎస్సీ – 2025లో దళిత దివ్యాంగ అభ్యర్థి అంజనప్పకు పీహెచ్ కేటగిరిలో ఉమ్మడి జిల్లాలో అత్యధిక మార్కులు వచ్చినప్పటికీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ కేటగిరిలో ఉద్యోగం రాలేదన్నారు. దీనిపై పదే పదే మదన పడుతూ ఉండటంతో అంజనప్ప ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలయ్యాడన్నారు. కదిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజనప్పను గురువారం ఓడీచెరువు మండల వికలాంగుల సమాఖ్య సభ్యులు, జిల్లా నాయకులు పరామర్శించారు. అంజనప్పకు జరి గిన అన్యాయాన్ని సాక్ష్యాధారలతో నిరూపించి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు.
నాగమల్లేశ్వరికి
పీడీగా పదోన్నతి
మడకశిర: మడకశిర సీడీపీఓ నాగమల్లేశ్వరికి పీడీగా పదోన్నతి లభించింది. ఈమేరకు సంబంధిత ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్ల నుంచి నాగమల్లేశ్వరి మడకశిర సీడీపీఓగా పని చేస్తున్నారు. ఆమెను ప్రభుత్వం పదోన్నతిపై నరసరావుపేట జిల్లా పీడీగా నియమించింది. ఇన్నాళ్లూ మడకశిర సీడీపీఓగా విధులు నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నాగమల్లేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.


