కూడేరు: మండల పరిధిలోని ముద్దలాపురంలో గురువారం ఎల్‌టీ విద్యుత్ లైన్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్న సమయంలో పటాన్ సాహు (46) అనే కార్మికుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. జేసీబీతో స్తంభం నిలబెడుతున్న సమయంలో స్తంభాన్ని పట్టుకున్న పటాన్ సాహు ఉన్నట్టుండి కిందపడి పోయాడు. తోటి కూలీలు, కాంట్రాక్టర్ అతన్ని కూడేరులోని పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్య సిబ్బంది మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రూపా హఠా గ్రామం. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పీహెచ్‌సీకి వచ్చి అతన్ని పరిశీలించారు. స్తంభం దగ్గర ఉన్న తమకు కరెంట్ వైబ్రేషన్ వచ్చిందని, అందుకే పటాన్ సాహు కిందపడేపోయాడని తోటి కార్మికులు పోలీసులకు తెలిపారు. అయితే కాంట్రాక్టర్ మాత్రం పటాన్ సాహు గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని చెబుతున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
పాము కాటుతో కూలీ మృతి
కనగానపల్లి: మండల పరిధిలోని పాతపాళ్యం కొత్తూరులో గురువారం పాము కాటుతో రైతు కూలీ కురుబ కిష్టయ్య (51) మృతి చెందారు. గ్రామస్తుల వివరాలమేరకు.. గ్రామానికి చెందిన కిష్టయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మిద్దైపె నిద్రించారు. అయితే తెల్లవారుజామున వర్షం రావటంతో కిందకు దిగి వచ్చాడు. మెట్ల కింద ఉన్న పామును కాలుతో తొక్కటంతో అది కాటు వేసింది. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కిష్టయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య ఎర్రమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
గుండెపోటుతో ఉపాధ్యాయురాలి మృతి
పుట్లూరు: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఒకేషనల్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఐశ్వర్య (29) గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఐశ్వర్య రోజులాగానే గురువారం పాఠశాలకు చేరుకుంది. ఉన్నట్లుండి హఠాత్తుగా కింద పడిపోవడంతో తోటి ఉపాధ్యాయులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
యువకుడి ఆత్మహత్య
మడకశిరరూరల్: మండల పరిధిలోని ఆమిదాలగొంది సమీపంలో ఉన్న చింత చెట్టుకు గురువారం సాయంత్రం జాడ్రపల్లికి చెందిన వడ్డే రమేష్ (30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలమేరకు.. వడ్డే రమేష్ గతంలో ఐచర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇటీవల ఎరువుల లారీకి డ్రైవర్‌గా వెళుతున్నాడు. ఈ క్రమంలో లారీ యజమాని దగ్గర కొంత అప్పు తీసుకుని సొంత ఖర్చుకు వాడుకున్నాడు. తీసుకున్న అప్పు తీర్చకుండా గ్రామానికి కూడా వెళ్లకుండా బయట తిరిగేవాడు. అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లావణ్య కేసు నమోదు చేసుకుని దర్యాపు చేపట్టారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


