వార్డుల పునర్విభజన షురూ.. | - | Sakshi
Sakshi News home page

వార్డుల పునర్విభజన షురూ..

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

తాడిపత్రి రూరల్‌: నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల్లో డివిజన్లు/ వార్డుల పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2 నుంచి 9వ తేదీలోపు పునర్విభజన ప్రతిపాదనల తయారీ పూర్తి చేయాలని అదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అనంతపురం నగరపాలక సంస్థతోపాటు తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి మునిసిపాలిటీల్లో నూతన వార్డులకు సంబంధించిన పునర్విభజన ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.

● 2011 జనాభా లెక్కల ప్రకారం మునిసిపాలిటీల్లో 30 వేల జనాభా ఉంటే 23 వార్డులు, 40 వేల లోపు ఉంటే 28 వార్డులు, 50వేల లోపు ఉంటే 32 వార్డులు, 60 వేల లోపు ఉంటే 36 వార్డులు, 80 వేల లోపు ఉంటే 40 వార్డులు, లక్షలోపు ఉంటే 44 వార్డులు, లక్షకుపైగా ఉంటే 48 వార్డులు, లక్షన్నర జనాభా ఉంటే 52 వార్డులు, నగరపాలక సంస్థ పరిధిలో 2 లక్షల వరకు జనాభా ఉంటే 60 డివిజన్లు, 3 లక్షల వరకు ఉంటే 62 డివిజన్లు, 4 లక్షల వరకు జనాభా ఉంటే 66 డివిజన్లు పెంచారు.

పెరిగిన డివిజన్లు/ వార్డులు

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 2,67,161 మంది జనాభా ఉండగా.. ఇందులో పురుషులు 1,34,064 మంది, మహిళలు 1,33,097 మంది ఉన్నారు. తాడిపపత్రి మునిసిపాలిటీలో 1,08,171 మంది జనాభాలో.. పురుషులు 54,015, మహిళలు 54,156 మంది, గుంతకల్లు మునిసిపాలిటీలో 1,26,270 మంది జనాభాకు గాను పురుషులు 62,851, మహిళలు 63,419 మంది, రాయదుర్గం మునిసిపాలిటీలో 61,749 మంది జనాభాకు గాను.. పురుషులు 30,911 మంది, మహిళలు 30,838 మంది, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలో 32,328 జనాభాకు గాను పురుషులు 16,036 మంది, మహిళలు 16,292 మంది, గుత్తి మునిసిపాలిటీలో 48,658 జనాభాకు గాను.. పురుషులు 23,943 మంది, మహిళలు 24,715 మంది ఉన్నారు. ఈ జనాభాను అనుసరించి అనంతపురం నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 62కు పెంచారు. తాడిపత్రి మునిసిపాలిటీలో వార్డుల సంఖ్య 36 నుంచి 48కు, గుంతకల్లులో 37 నుంచి 48కు, రాయదుర్గంలో 32 నుంచి 40కు, గుత్తిలో 25 నుంచి 32కు, కళ్యాణదుర్గంలో 24 నుంచి 32 వార్డులను పెంచారు. మొత్తం మీద పునర్విభజన కింద అదనంగా 12 డివిజన్లు, 46 వార్డులను పెంచినట్లయ్యింది.

పునర్విభజన పనులు ప్రారంభం

జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్‌తో పాటు ఐదు మునిసిపాలిటీల్లో గురువారం నుంచి వార్డుల పునర్విభన పనులను అధికారులు ప్రారంభించారు. ఈ నెల 9వ తేదీలోపు వార్డులను పునర్విభజన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 10వ తేదీన నూతన వార్డుల వివరాలను ప్రచురించనున్నారు. 15లోపు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను కోరనున్నారు. 17 నుంచి 26 వరకు వివరాలను మునిసిపల్‌ పరిపాలన అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌కు పంపాల్సి ఉంది. ఏప్రిల్‌ 26 నుంచి మే 2 వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాక వార్డుల పునర్విభజనను ఆమోదిస్తారు. మే 3నుంచి 5వ తేదీ లోపు వార్డుల స్వరూపాన్ని గెజిట్‌లో ప్రచురిస్తారు.

ఇప్పట్లో ఎన్నికలు లేనట్టేనా..?

ఒక వైపు వార్డుల పునర్విభజన, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 2026 జనగణన తదితర కార్యక్రమాల వల్ల ఇప్పట్లో మునిసిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. మునిసి పాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది పునర్విభజన పనులను చేయాల్సి ఉంటుంది. వార్డుల్లోని సరిహద్దుల విభజనకు రోడ్లు, కాలువలను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. సాధారణంగా మునిసిపల్‌ ఎన్నికలంటే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతుంటాయి. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంపై మునిసిపాలిటీల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడతో పాటు ఉన్న పథకాలను రద్దు చేయడం తదితర కారణాల వల్ల ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించి.. ఉన్న పరువును తీసుకునే తెలివితక్కువ నిర్ణయం ప్రభుత్వం తీసుకోదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ నెల 9లోపు ప్రతిపాదనల తయారీ

2011 జనాభాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ అదేశాలు

జిల్లాలో కొత్తగా 12 డివిజన్లు, 46 వార్డుల పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement