● ఇద్దరి పరిస్థితి విషమం
బత్తలపల్లి: కల్వర్టులోకి ద్విచక్ర వాహనం దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరానికి చెందిన కుంటాల అభినయ్, సాత్విక్, వరుణ్.. నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. శనివారం ముదిగుబ్బ మండలం కన్యకలగొందికి వెళ్లిన ముగ్గురు అక్కడ వివాహ వేడుక చూసుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. బత్తలపల్లి మండలం గుమ్మల్లకుంట వద్దకు రాగానే వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని మోరీలోకి దూసుకెళ్లింది. వాహనంతో పాటు ముగ్గురూ మోరీలోకి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, సాత్విక్, వరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


