ముందస్తు బిల్‌.. నాణ్యత డల్‌ | - | Sakshi
Sakshi News home page

ముందస్తు బిల్‌.. నాణ్యత డల్‌

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

పనులు పూర్తి కాకనే బిల్లులు డ్రా

అధికార పార్టీ నేతల అండదండలతోనే..

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: సీసీ రోడ్ల నిర్మాణాల్లో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. పనులు పూర్తికాకనే కాంట్రాక్ట్‌ సంస్థకు అధికారులు బిల్లులు చేసేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతో ఈ తంతు సాగింది. బిల్లులు వచ్చేశాక సదరు సంస్థ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా అడిగే దిక్కులేకుండా పోయింది. బ్రహ్మసముద్రం మండలంలో ఎస్‌ఎల్‌ఎన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ చేపట్టిన పనుల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పాలవెంకటాపురంలో సోదల గోవిందు ఇంటి నుంచి బసవరాజు ఇంటి వరకు రూ.39,97,398తో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా ప్రధాన రహదారిలో సీతారామాంజినేయులు ఆలయం నుంచి అమరా శ్రీరాములు ఇంటి వరకు రూ.17,96,423 నిధులతో మరో సీసీ రోడ్డు, శ్రీరాములు ఇంటి నుంచి సోదల గోవిందు ఇంటి వరకు రూ.39,95,361తో ఇంకో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ఇంకా జరుగుతున్నాయి. అయినా మూడు పనుల బిల్లులు కలిపి రూ.97,89,182 కాంట్రాక్ట్‌ సంస్థ డ్రా చేసేసుకుంది.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల చేతివాటం..

బ్రహ్మసముద్రం మండలంలో ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు అధికార పార్టీ నేతల అండదండలతో చేతివాటం ప్రదర్శించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భైరవానితిప్ప నుంచి బసాపురం (కర్ణాటక సరిహద్దు) వరకు మట్టిముర్రం రోడ్డుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎస్టిమేట్‌ వేసి కూలీలకు బిల్లులు చేసినట్లు రికార్డులు సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే భైరవానితిప్ప ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తిప్పేస్వామి భార్య పాలాక్షి పేరున మరోసారి పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి రూ. మొత్తం రూ.1,60,258 బిల్లులు డ్రా చేశారు.

● కన్నేపల్లి పంచాయతీలోని ముద్దలాపురం నుంచి రాయలదొడ్డి వరకు ఉపాధి హామీ పథకం కింద మట్టి ముర్రం రోడ్డు నిర్మించారు. గతంలో నిర్మించిన ఈ రోడ్డుకే కూలీలకుతో తాజాగా పనులు చేయించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. బయటి ప్రాంతం నుంచి మట్టి తరలించినట్లు, ట్యాంకర్‌తో నీటిని తీసుకువచ్చి క్యూరింగ్‌ చేసినట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నాగరాజు తన బినామీ అయిన లోకేష్‌ పేరుతో రూ.2,51,915 బిల్లు చేసుకున్నారు.

అధికారుల చోద్యం

బ్రహ్మసముద్రం మండలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీ రాజ్‌ శాఖ పనుల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు హడావుడి చేయడం.. అనంతరం అధికార పార్టీ నేతలు ఇచ్చే విందులో పాల్గొని వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. విచారణకు రాగానే టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండానే వెనుదిరుగుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భైరవానితిప్ప నుంచి బసాపురం వెళ్లే రోడ్డు దుస్థితి

పాలవెంకటాపురంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement