ఉరవకొండ: మేజర్ పంచాయతీ ఉరవకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి చిన్నారులు, పెద్దలు సహా 13 మందిని గాయపరిచింది. శనివారం సత్యనారాయణపేట, వడ్డే వీధిలోకి వచ్చిన పిచ్చికుక్క కనిపించిన వారిపై దాడి చేసింది. రెడ్డికృష్ణ, మణికంఠ, సంజయ్, వన్నూర్‌స్వామి, ప్రేమ్, కృష్ణమూర్తి, నారాయణస్వామి, లక్ష్మి, ప్రభావతమ్మ, గోపి, మానస, సంజీవ, ప్రభాకర్ గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే కాలనీవాసులు పంచాయతీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సిబ్బంది ఎవ్వరూ కుక్కను పట్టుకోవడానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని వాపోయారు.
రేపు సీఎం చంద్రబాబు రాక
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 6న జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11.10 గంటలకు యాడికి మండలం వేములపాడు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు యాడికి మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుని.. సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.40 గంటలకు పెండేకల్లు రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి వేములపాడు చేరుకుని సాయంత్రం 4.10 గంటలకు సమావేశంలో ఉంటారు. సాయంత్రం 4.20 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లికి వెళతారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
యాడికి: సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. యాడికిలోని వేముల పాడు రోడ్డులో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ ప్రాంతంతో పాటు మార్కెట్ యార్డు, జలహారతి నిర్వహించే పెండేకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాంతాలను కలెక్టర్‌తో పాటు ఎస్పీ జగదీష్, సీఎం పర్యటన కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లూ రాకూడదన్నారు. పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం పర్యటనకు వచ్చే ప్రజా ప్రతినిధులు, ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


