పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే | - | Sakshi
Sakshi News home page

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌ డాక్టర్‌ హేమచంద్రారెడ్డి

గుంతకల్లు రూరల్‌: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని, ఆ దిశగా విద్యార్థులు శ్రమించాలని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌ డాక్టర్‌ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లు శివారున ఉరవకొండ మార్గంలో ఉన్న ఎస్వీఐఎస్‌ స్కూల్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్‌ హేమచంద్రారెడ్డి, గుంతకల్లు ఇరిగేషన్‌ ఇంజనీర్‌ పవన్‌కుమార్‌, శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. చదువులపై దృష్టి కేంద్రీకరించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆటపాటలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్‌ మంజునాథ్‌, కరస్పాండెంట్‌ ఓంకారప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి!

తాడిపత్రి టౌన్‌: ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతో ఓ మహిళ మృతి చెందింది. విశ్వసనీయ సమాచారం మేరకు... తాడిపత్రిలోని పాతకోటకు చెందిన మహిళ (35) శుక్రవారం రాత్రి వాంతులు, విరోచనాలతో బాధపడుతుంటే కుటుంబసభ్యులు ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద ఉన్న ఓ ఆర్‌ఎంపీని సంప్రదించారు. దీంతో ఆయన సైలెన్‌ బాటిళ్లు పెట్టి చికిత్స చేసినట్లు తెలిసింది. కాసేపటికే ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం బయటపడకుండా సదరు ఆర్‌ఎంపీ వెంటనే దుప్పటి పంచాయితీతో మృతురాలి కుటుంబసభ్యులకు కొంత డబ్బు చెల్లించినట్లుగా తెలిసింది.

నవజాత శిశువు మృతి

పెనుకొండ రూరల్‌: ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఇంటికి చేరుకున్న నవజాత శిశువు మృతి చెందింది. పెనుకొండ మండలం గుట్టూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... గుట్టూరుకు చెందిన గర్భిణి స్నేహిలతకు 20 రోజుల క్రితం పురిటి నొప్పులు మొదలు కాగానే కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రసవం అనంతరం పండంటి మగబిడ్డతో నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి స్నేహలత చేరుకుంది. శనివారం ఉదయం ఉన్నఫళంగా నవజాతి శిశువు ముక్కు నుంచి రక్త స్రావం కావడంతో. కుటుంబ సభ్యులు గుట్టూరులోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి సిబ్బంది సూచన మేరకు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిశువు అచేతనంగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అందించడంలో గుట్టూరు సీహెచ్‌సీ సిబ్బంది విఫలమయ్యారంటూ శిశువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గుట్టూరు సీహెచ్‌సీ డాక్టర్‌ నాగరాజు నాయక్‌ మాట్లాడుతూ.. నవజాత శిశువు బరువు తక్కువగా ఉన్న కారణంగా 15 రోజులకు పైగా అనంతపురంలోని సర్వజనాస్పత్రిలోనే చికిత్స చేశారన్నారు. గుట్టూరు సీహెచ్‌సీలో చిన్నపిల్లల వైద్య నిపుణుడు లేకపోవడంతో పెనుకొండకు తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement