రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో జిల్లా వాసులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రత్నగిరి సంస్థానం రాజవంశీకుడు దొర రంగప్పరాజు, కై వాడస్తులు, గ్రామ పెద్దలు తదితరులు శనివారం తెలిపారు.
నేడు అంకురార్పణ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవ విగ్రహానికి అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు చేస్తారు. అనంతరం భక్తులు కానుక రూపంలో తీసుకొచ్చే పట్టు వస్త్రాలు, వడిబియ్యం కట్టి, వెండి, బంగారు ఆభరణాలతో పాటు పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపండితుల సమక్షంలో గణపతి పూజ చేసి కలశ స్థాపన చేస్తారు. రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ చుట్టూ మేళతాళాలతో పాటు పురవీధుల గుండా ఊరేగిస్తారు. ఆ తర్వాత ఆలయం ప్రాంగణంలో అమ్మవారిని కొలువుదీర్చి అర్ధరాత్రి మేళతాళాలతో సమీపంలోని పాలబావి వద్దకు భక్తులు చేరుకుంటారు. పాలబావిలో ఉత్సవ విగ్రహాలను ప్రధాన అర్చకులు గంగాజలంతో దేవతను శుద్ధి చేసి అమ్మవారికి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం, పూలు, పండ్లు, హారతి చేసిన తర్వాత నైవేద్యంగా బావిలోకి సమర్పిస్తామన్నారు. పాలబావిలో అమ్మవారికి గంగా జలంతో శుద్ధి చేసిన అనంతరం పూజలు నిర్వహిస్తే సంతాన భాగ్యం, వివాహ యోగం కలుగుతుందని, ధీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులు పాలబావి వద్దకు గంగ పూజ చేయడానికి మహిళలు తండోపతండాలుగా తరలివస్తారు.
కార్యక్రమాలు ఇలా..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 5వ తేదీన జలధి ఉత్సవం, కలశ స్థాపన, 6వ తేదీన బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 7వ తేదీన జలఘి, కలశ ఉత్సవం, గంగ పూజ, 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు, 12వ తేదీన అమ్మవారికి పుష్పాలంకారణ, పోతరాజుల విశేష పూజ, అదేరోజు రాత్రి శాంభవి మహాత్మే పౌరాణిక నాటిక ప్రదర్శన (కన్నడ), 13వ తేదీన పోతరాజు బండార కార్యక్రమం, తీర్థప్రసాద వినియోగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం నుంచి 13వ తేదీ వరకు పశువుల జాతర కూడా ఉంటుందని వెల్లడించారు.
విశేష అలంకరణలో కొల్హాపురి మహాలక్ష్మీదేవి, బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన కొల్హాపురి అమ్మవారి ఆలయం


