గుత్తి రూరల్: చెత్తకు అంటించిన నిప్పు వేడికి చెట్టుపైనున్న తేనెటీగలు ఒక్కసారిగా బయటకు వచ్చి సమీపంలోని వారిపై దాడిచేయడంతో ఆరుగురు గాయపడ్డారు. శ్రీపురం గ్రామానికి చెందిన పెద్దరాముడు, రామ మునేంద్ర, వెంకటేష్, లక్ష్మీదేవి, మల్లీశ్వరి, శివలక్ష్మికి గ్రామ శివారులో పక్కపక్కనే పొలాలు ఉన్నాయి. శుక్రవారం పంటల సాగు కోసం పొలం పనులకు ఉపక్రమించారు. అందరి పొలాలు శుభ్రం చేసిన అనంతరం పోగైన చెత్తను గట్టు వద్దకు తెచ్చి కుప్పవేసి మంట పెట్టారు. సమీపంలోనే ఉన్న చెట్టుపై ఉన్న పెద్ద తేనెటీగలు పొగకు ఒక్కసారిగా చెదిరిపోయి అక్కడున్న వారిపై దాడి చేశాయి. ముళ్లు గుచ్చుకుని గాయపడిన ఆరుగురిని కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తేనెటీగల దాడిలో గాయపడి గుత్తి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు


