కళ్యాణదుర్గం: ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ అడ్డంకులు తొలగినందున ఆర్డీటీ సంస్థ ఇక ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు డాక్టర్ తలారి రంగయ్య సూచించారు. పేదల కోసం పాటుపడుతున్న ఆర్డీటీకి భవిష్యత్తులో కూడా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో తలారి రంగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమానికి వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఉద్యమం తారస్థాయికి చేరడంతో కేంద్రం స్పందించి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ చేసింది. రెన్యూవల్ సాధనకు తోడ్పాటునందించినందున కృతజ్ఞతగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఆర్డీటీ లబ్ధిదారులు సోమవారం కళ్యాణదుర్గంలో తలారి రంగయ్యకు ఘన స్వాగతం పలికి, సన్మానం చేశారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆర్డీటీ ఆస్పత్రికి ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగయ్య మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేదలకు విద్య, వైద్య, వ్యవసాయం, స్వయం ఉపాధి రంగాల్లో ఆర్డీటీ సంస్థ స్ఫూర్తిదాయకంగా సేవలందించిందన్నారు. అలాంటి సంస్థకు 2025లో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ కాకపోవడంతో సేవలకు ఆటంకం ఏర్పడిందన్నారు. చివరకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. అయితే కూటమి పార్టీల నాయకులు గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ ఆగిపోయిందంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. ఆర్డీటీని రాజకీయాలకు వాడుకోరాదని హితవు పలికారు. ఆర్డీటీ సంస్థ ద్వారా ప్రజలకు నిరాటంకంగా సేవలందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సంయుక్త కార్యదర్శులు ములకనూరు తిమ్మరాయుడు, దొడఘట్ట నారాయణ తదితరులు పాల్గొన్నారు.


