పరిష్కరించకుంటే మెమో | - | Sakshi
Sakshi News home page

పరిష్కరించకుంటే మెమో

Mar 31 2026 8:50 AM | Updated on Mar 31 2026 8:50 AM

గార్లదిన్నె రెవెన్యూ సిబ్బందికి జేసీ హెచ్చరిక

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం అర్బన్‌: ‘తమాషా చేస్తున్నారా.. సమస్య పరిష్కరించకుండా అర్జీదారును నాలుగేళ్లుగా తిప్పుకుంటారా.. వారంలోగా సమస్య పరిష్కరించకుంటే మీ అందరికీ మెమో జారీ చేస్తా’ అంటూ జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ గార్లదిన్నె రెవెన్యూ సిబ్బందిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్‌, పద్మావతితో కలిసి జాయింట్‌ కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆనంద్‌ అనే కానిస్టేబుల్‌ తన సమస్యను జేసీకి విన్నవించారు. ‘గార్లదిన్నె మండలం కనంపల్లి సర్వే నంబరు 327లో మా నాన్న ఎర్రినాగప్ప పేరున రెండు ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని నా భార్య పేరున (ఖాతా 5005, ఎల్‌పీ 298) మా నాన్న రాసిచ్చారు. దీనికి 2022లో (ఈ5/1620/2022) ఎన్‌ఓసీ వచ్చింది. అయితే ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ప్రభుత్వ భూమిగానే ఉండటంతో దాన్ని తొలగించాలంటూ నాలుగేళ్లలో 100 సార్లకుపైగానే తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించలేదు’ అని విన్నవించారు. జేసీ స్పందిస్తూ గార్లదిన్నె రెవెన్యూ సిబ్బందిని పిలిపించారు. వారంలోగా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. లేదంటే అందరికీ మెమో జారీ చేస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

వినతులు కొన్ని..

● అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డులోని దామోదర సంజీవయ్య కాలనీలో నీరు, విద్యుత్‌ సదుపాయం లేదని కాలనీవాసి వెంకటేష్‌గౌడ్‌, తదితరులు అర్పీ అందజేశారు. తమ కాలనీకి నీటి, విద్యుత్‌ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

● పంచాయతీ అనుమతి లేకుండా సొసైటీ స్థలంలో షాపు గదులు నిర్మిస్తున్నారని పెద్దపప్పూరుకు చెందిన నాగరాజు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 63, 83లో సొసైటీ భూములు ఉన్నాయని తెలిపారు. సర్వే నంబరు 83లోని భూముల్లో ఎవరికీ తెలియకుండా పంచాయతీ అనుమతి లేకుండా దుకాణ గదులు నిర్మిస్తున్నారని, దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తాడిపత్రి అభివృద్ధి ఎక్కడ జేసీ?

ఏడీఏ అల్తాఫ్‌ అలీఖాన్‌ సస్పెన్షన్‌

అనంతపురం అగ్రికల్చర్‌: వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్‌ ఏడీఏ జీఎం అల్తాఫ్‌ అలీఖాన్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ిసిఫారసు మేరకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ ఎక్స్‌ అఫిషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ సోమవారం జీఓ విడుదల చేశారు. ఏడీఏ వ్యవహారశైలిపై తరచూ పత్రికలు, మీడియాలో వ్యతిరేక వార్తలు ప్రచురితం కావడం, అలాగే ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా జిల్లా కేంద్రంలో ఉన్న డివిజన్‌ కార్యాలయాన్ని రూరల్‌ మండలం కక్కలపల్లి ప్రాంతానికి మార్పు చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్‌ వేటు వేశారు.

తాడిపత్రి టౌన్‌: అభివృద్ధి అంటూ అరవడం తప్ప తాడిపత్రి ప్రాంతం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలంటూ టీడీపీ నేత, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. రోడ్ల పక్కన మొక్కలు నాటి అదే అభివృద్ధి అంటే ఎలా అని నిలదీశారు. రోడ్లు వెడల్పు చేస్తామంటూ దుకాణాలు, ఇళ్లకు మార్కింగ్‌లు ఇచ్చి వ్యాపారులను, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ వారి నుంచి ముడుపులు దండుకోవడం తప్ప తాడిపత్రి అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు ఏమీ లేవన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పట్టణ, రూరల్‌ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి సమావేశమై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడైనా వెలువడే అవకాశముందని, ఈ నేపథ్యంలో ఎన్నికలకు అందరూ సిద్దంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ టీడీపీ నాయకుల దురాగతాలను ఎండగట్టాలన్నారు. అధికారం అండతో జేసీ సాగించిన అక్రమాలు, దుర్మార్గాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. 30 ఏళ్ల జేసీ సోదరుల రాజకీయంలో తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. పేకాట, మట్కా తదితర జూదాలతో పాటు గంజాయి కేంద్రంగా తాడిపత్రిని మార్చేశారని మండిపడ్డారు. తాడిపత్రిలో పేకాట నిర్వహణకు రోజూ రూ.30వేలు, మట్కా నిర్వహణకు ప్రతి నెలా రూ.50 లక్షలు చొప్పున మామూళ్లను పోలీసులు దండుకుంటున్నారని ఆరోపించారు. బడిపిల్లలకు సైతం గంజాయి దొరుకుతోందని మండిపడ్డారు. మున్సిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు జేసీకి తొత్తులుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎర్రవంక భూముల అక్రమాలపై మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. జేసీ ప్రభాకరరెడ్డి దౌర్జన్యాలకు నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ రాబోవు రోజుల్లో న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ రాబర్ట్‌, రూరల్‌ కన్వీనర్‌ విజయ్‌కాంత్‌రెడ్డి, నాయకులు రాఘవేంద్ర ప్రసాద్‌, గంగులకుంట కేశవరెడ్డి, కాశీ మనోజ్‌, కంచం రామ్మోహన్‌రెడ్డి, నాగూర్‌ షరీఫా, ఆలూరు రామేశ్వరెడ్డి, నరసింహారెడ్డి, ఓబులరెడ్డి, గడ్డం పరమేష్‌, ఓబులేసు రెడ్డి, జిలాన్‌బాషా, రేవతి, డీవీ కుమార్‌, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జంగంపల్లిలో రణబలి సందడి

యల్లనూరు: మండలంలోని జంగంపల్లిలో రెండో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సందడి చేశారు. రాజుల కాలం నాటి కోటతో పాటు స్థానికుడు కృష్ణమనాయుడుకు చెందిన పురాతన ఇంటిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కోట తలుపులు బద్దలుకొట్టుకుని లోపలకు ప్రవేశించే సన్నివేశం ఆద్యంతం ఉత్కంఠను గొల్పింది. కాగా, జంగంపల్లిలో రణబలి షూటింగ్‌ ప్రక్రియ దాదాపు ముగిసినట్లయింది. చాలామంది అభిమానులు రెండు రోజులుగా విజయ్‌ దేవరకొండను కలిసి సెల్పీలు తీసుకోవాలని ఆత్రుత పడగా భద్రతా చర్యల నేపథ్యంలో వారికి నిరాశనే మిగిలింది.

విద్యుదాఘాతంతో జేఎల్‌ఎం మృతి

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ షాక్‌కు గురై జూనియర్‌ లైన్‌మెన్‌ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురంలోని డీ–3 సెక్షన్‌ పరిధిలో జేఎల్‌ఎంగా పని చేస్తున్న వెంగముని (43) ఆదివారం రాత్రి 1వరోడ్డులోని శివాలయం విద్యుత్‌ సమస్య తలెత్తడంతో మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. ఎల్‌సీ తీసుకుని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఎగ్జిట్‌ ఫ్యూజులు మారుస్తుండగా రివర్స్‌లో విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై పై నుంచి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, వెంగమునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ ఉద్యోగులు సోమవారం కళ్యాణదుర్గం రోడ్డులోని వెంగముని ఇంటికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.

జర్నలిస్టులకు నేడు మెగా వైద్యశిబిరం

అనంతపురం అర్బన్‌: అక్రిడిటేషన్‌ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం మంగళవారం కలెక్టరేట్‌లో మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు సమాచార శాఖ పీఆర్‌ఓ బాలకొండయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్‌ సహకారంతో సమాచార, జిల్లా వైద్యారోగ్య శాఖలు, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నారు. తొమ్మిది రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. కార్యక్రమంలో కిమ్స్‌ సవేరా, పావని, మార్క్‌, శ్రీనివాస, చంద్ర, కుమార్‌, స్నేహలత, మ్యాగ్నస్‌, మమత ఆస్పతులకు చెందిన జనరల్‌ ఫిజీషియన్‌, జనరల్‌ సర్జన్‌, కార్డియాలజిస్ట్‌, గైనకాలజిస్ట్‌, ఆర్థోపెడిక్‌, న్యూరో ఫిజీషియన్‌, నేత్ర, దంత, ఈఎన్‌టీ, యూరాలజిస్ట్‌ నిపుణులు పాల్గొని వైద్యసేవలు అందించనున్నారు.

కనకరాజుకు ఎస్పీగా పదోన్నతి

అనంతపురం సెంట్రల్‌: అదనపు ఎస్పీగా అనంతపురం పోలీసు ట్రైనింగ్‌ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న కనకరాజుకు పదోన్నతి దక్కింది. సీఐడీ ఎస్పీగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు పీటీసీ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

కుడి కాలువకు నీటి సరఫరా తగ్గింపు

కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) నుంచి ధర్మవరం కుడి కాలువకు నీటి విడుదలను సోమవారం తగ్గించారు. ఇప్పటి వరకూ 630 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తూ వచ్చారు. అయితే కాలువ పరిధిలోని ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 49 చెరువులు నీటితో నిండడంతో నీటి విడుదలను 300 క్యూసెక్కులకు తగ్గించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement