గుత్తిలో వరుస చోరీలు
గుత్తి: స్థానిక తాడిపత్రి మార్గంలోని మూడు దుకాణాల్లో గురువారం తెల్లవారు జామున దొంగలు పడ్డారు. మురళీకృష్ణ జనరల్ స్టోర్స్, గంగాగౌరీ ట్రేడర్స్, శ్రీలక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ దుకాణాల్లో చొరబడిన దుండగులు కొంత నగదు, విలువైన సామగ్రిని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
20 వేల హెక్టార్లకు
డ్రిప్ ప్రతిపాదనలు
అనంతపురం అగ్రికల్చర్: ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 20 వేల హెక్టార్లకు రాయితీతో డ్రిప్, స్ప్రింక్లర్ యూనిట్లు కేటాయించనున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి ఏపీడీ బీసీ ధనుంజయ తెలిపారు. ఈ మేరకు కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపినట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులు త్వరలో రావచ్చన్నారు. ప్రస్తుతానికి 50,370 హెక్టార్లకు సంబంధించి పరికరాలు కావాలంటూ 37,812 మంది రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారన్నారు.
నేడు కేవీఐసీ చైర్మన్ రాక
అనంతపురం టౌన్: భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ మనోజ్‌కుమార్ శుక్రవారం అనంతపురం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస యాదవ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. చింత పండు ప్రాసెసింగ్, పేపర్ ప్లేట్ తయారీ, ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రం, ఎసీ మరమ్మతు, కుట్టు యంత్రం, నార తీయడం వంటి గ్రామీణ పరిశ్రమల కార్యకలాపాలకు సంబంధించి శిక్షణ పూర్తి చేసుకున్న 430 మంది చేతి వృత్తిదారులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు.
జిల్లా రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులు
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా బి. శ్రీనివాసులను నియమిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. రెగ్యులర్ డీఆర్‌గా పని చేస్తున్న కోర్టు ఉత్తర్వుల మేరకు ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి భార్గవ్‌ను అనంతపురం జిల్లా ఆడిట్ డీఆర్‌గా బదిలీ చేశారు. ఆడిట్ డీఆర్‌గా పని చేస్తున్న శ్రీనివాసులను డీఆర్ (ఎఫ్‌ఏసీ) గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
అనంతపురం ఎడ్యుకేషన్: బాలల ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం (ఆర్టీఈ) 12(1)(సి) కింద 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలివిడత లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. వివరాలను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ టి. శైలజ గురువారం వెల్లడించారు. 1 కిలోమీటరు పరిధిలో ఉన్న 1,712 మంది విద్యార్థులు తొలి విడతలో ఎంపికయ్యారు. వీరి వివరాలను తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. అలాగే ఫలితాలను https://cse.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ లోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవాలి. విద్యార్థి, తల్లిదండ్రులు, తోబుట్టువుల ఆధార్ కార్డులు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, జనన సర్టిఫికేట్, రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాలి. సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే సంబంధిత స్కూళ్ల యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయి. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఎంఈఓను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 ను సంప్రదించవచ్చు. కాగా, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యార్థుల కోసం రెండో విడత లాటరీ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు.


