అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకనే సమస్య తలెత్తి తాగునీటికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సమగ్ర శిక్ష ఏపీసీ టీ.శైలజ పేర్కొన్నారు. ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వహణపై జిల్లాలోని 107 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గురువారం స్థానిక సైన్స్ సెంటర్‌లో ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆర్‌ఓ ప్లాంట్లు సరఫరా చేసిన ఆహ్లాద కంపెనీ, ఇన్నోవేటివ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని డెమో ద్వారా ప్లాంట్ల నిర్వహణ, వినియోగ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడారు. చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించకుండా అలాగే వదిలేస్తుండడంతో అవి పెద్ద సమస్యగా మారుతున్నాయన్నారు. సమస్యలు నెలకొన్న పాఠశాలల వివరాలు తెలియజేస్తే కంపెనీలతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. ఇంజనీర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. నీటి కొరత, పైప్‌లైన్ లేకపోవడం, విద్యుత్ సమస్యలు వంటి అంశాలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. అసిస్టెంట్ ఏఎంఓ నారాయణస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్‌ఓ ప్లాంట్లు సరఫరా చేసిన ప్రతి కంపెనీతో కలిసి పాఠశాల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఓ నారాయణస్వామి మాట్లాడుతూ.. చిన్న పాటి సమస్యలను పాఠశాల స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, పెద్ద సమస్యలను సమగ్ర శిక్ష ద్వారా పరిష్కరిస్తామని సూచించారు.


