● 40 డిగ్రీల మార్క్‌ను చేరుకున్న ఉష్ణోగ్రతలు
● బెంబేలెత్తుతున్న జనం
అనంతపురం అగ్రికల్చర్: భానుడి భగభగలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజులుగా 39 డిగ్రీల వద్ద ప్రతాపం చూపిస్తున్న సూరీడు ప్రస్తుతం 40 డిగ్రీల మార్క్‌ను చేరుకున్నాడు. ఈ సీజన్‌లో తొలిసారిగా గురువారం తాడిపత్రి మండలంలో 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దపప్పూరు, విడపనకల్లు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి, వజ్రకరూరు తదితర మండలాల్లో వేసవితాపం అధికంగా ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా 38 నుంచి 39 డిగ్రీలతో భగ్గుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా ఏప్రిల్, మే నెలలు ఉండటంతో ఈ సారి 45 డిగ్రీల మార్క్ చేరుకునే పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 42 డిగ్రీలు నమోదైతేనే ‘అనంత’ అగ్నిగుండంలా అట్టుడికిపోయే ప్రమాదం ఉండగా అంతకు మించి అంటుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే సుర్రుమంటున్న సూరీడు సాయంత్రం 5 గంటల దాకా ప్రతాపం చూపిస్తున్నాడు. రాత్రిళ్లు ఉక్కపోత అధికమవుతోంది. వేడిగాలులు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదని వైద్యులు అంటు న్నారు. మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ ఎక్కువ తీసుకోవాలని చెబుతున్నారు. టోపీ, గొడుగు, మాస్క్ లాంటివి వాడటం మంచిదని సూచిస్తున్నారు. వడదెబ్బకు గురి కాకుండా వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


