రాయదుర్గం టౌన్: ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు ఐదు మున్సిపాలిటీలు వెనుకంజలో ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నాటికి 53.35 శాతం పన్ను వసూళ్లు మాత్రమే జరిగాయి. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం వరకు మాఫీ ఇచ్చినా ఆశించిన మేర ఫలితాలు దక్కలేదు. పూర్తి వడ్డీ మాఫీ వస్తుందని ఆశించిన యజమానులు... కేవలం 50 శాతం మాత్రమే ఇవ్వడంతో నిరాశకు గురయ్యారు.
లక్ష్య సాధనలో సుదూరంగా...
ఈ నెలాఖరులోపు వంద శాతం పన్ను వసూళ్లు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్, తాడిపత్రి, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీల్లో 1,59,133 అసిస్‌మెంట్లు ఉండగా రూ.113.03 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకూ కేవలం రూ.60.32 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. 71.26 శాతంతో తాడిపత్రి మొదటి స్థానంలో ఉండగా, 69.75 శాతంతో రాయదుర్గం రెండో స్థానంలో నిలిచింది. 60.98 శాతంతో మూడో స్థానంలో గుత్తి, 50.87 శాతంతో నాల్గో స్థానంలో అనంతపురం, 47.67 శాతంతో ఐదో స్థానంలో గుంతకల్లు, 44.70 శాతంతో ఆరో స్థానంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత గడువులోపు లక్ష్యాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక ఐదురోజులే గడువు
లక్ష్య సాధనలో వెనుకంజ
71.26 శాతంతో మొదటిస్థానంలో తాడిపత్రి
69.75 శాతంతో రెండోస్థానంలో రాయదుర్గం


