ఆర్డీటీపై కక్ష సాధింపు తగదు | - | Sakshi
Sakshi News home page

ఆర్డీటీపై కక్ష సాధింపు తగదు

Mar 10 2026 7:30 AM | Updated on Mar 10 2026 7:30 AM

పేదలకందిస్తున్న సేవలను గుర్తించండి

ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయండి

మహా ధర్నాలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: పేదలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఇతోధిక సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో ఇబ్బందులకు గురిచేయడం తగదని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి అన్నారు. మతం రంగు పులమకుండా పేదలకు చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని సంస్థ సేవలు కొనసాగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఆర్డీటీ సేవలు కొనసాగేలా ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, దళిత, ప్రజా సంఘాలతో కలిసి సోమవారం ఉరవకొండలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీతో తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ఆర్డీటీ ద్వారా అందుతున్న సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల అసమర్థత వల్లే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ కాలేదన్నారు. ఏడాది కాలంగా ఆర్డీటీ సంస్థ విషయంలో మభ్యపెట్టి జిల్లా ప్రజలను తీవ్రంగా మోసగిస్తున్నారన్నారు. కరువు పీడిత అనంతపురం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, విద్య, వైద్యం, మహిళా సాధికారతకు కృషి చేసిన ఆర్డీటీకి విదేశీ నిధులు రాకుండా చేయడంతో సంస్థ మనుగడ కష్టంగా మారిందన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని, సంస్థ తమ ఆస్తులు అమ్ముకుని మరో దేశానికి తరలిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వై.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి నిలువునా మోసం చేశారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మత రాజకీయాలను ఆర్డీటీకి అంటగడుతూ విదేశీనిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.రమణ మాట్లాడుతూ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరించే వరకు ఆర్డీటీ ద్వారా పేదలకు అందుతున్న సేవలు కొనసాగేందుకు వెంటనే బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో ఒకసారి చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. అనంతరం వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.ప్రణయ్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేశవరెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు కృష్ణమూర్తి, దళిత, గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మీనుగ గోపాల్‌, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మధు, బీహెచ్‌పీ నేత తిప్పేస్వామి తదితరులు ప్రసంగించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినపతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, వైస్‌ ఎంపీపీ ఈడిగ ప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌, జెడ్పీటీసీ ఏసీ పార్వతమ్మ, సర్పంచ్‌ లలితమ్మ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్‌పర్సన్‌ సుశీలమ్మ పాల్గొన్నారు.

ధర్నాలో ప్రసంగిస్తున్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, ధర్నాలో పాల్గొన్న అఖిల పక్ష పార్టీల ముఖ్యనేతలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement