● నేడు ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం
కదిరి: ఎక్కడెక్కడి నుంచో విచ్చేసిన జనం... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం. బ్రహ్మే రథసారథిగా మారే సందర్భం. ఉగ్రుడైన లక్ష్మీనారసింహుడు శాంతమూర్తిగా రథంపై కొలువుదీరి భక్తులకు కనిపించే కమనీయ దృశ్యం. లక్షలాదిమంది ఒకచోట చేరే ఆధ్యాత్మిక సౌరభం. అదే ఖాద్రీశుడి బ్రహ్మరథోత్సవం. మంగళవారం ఉదయం సరిగ్గా 8.45 గంటలకు ప్రారంభం కానుంది.
దేశంలోనే మూడో పెద్ద తేరు
తమిళనాడు ఆండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతిపెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతిపెద్ద బ్రహ్మరథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 125 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో 8 అడుగుల డయామీటర్‌తో ఉన్నాయి. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా చెక్కారు. వివిధ భంగిమల్లో చెక్కిన ఈ బొమ్మలు అప్పటి శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రథ చక్రాలకు ఈ మధ్యే మరమ్మతులు కూడా చేశారు. రథోత్సవంలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఐరావతంపై నారసింహుడు
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి తెల్లటి ఐరావతం(గజవాహనం)పై భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్య కస్యపుని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మరోసారి యథారూపంలో ప్రసన్నం కావాలన్న కోరగా... స్వామి వారు వారి కోరిక మేరకు తెల్లటి ఐరావతంపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఐరావతంపై విహరించే ఖాద్రీశుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఆలయ అర్చకులు తొలుత యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశ పూజలు చేసిన అనంతరం కలశాన్ని శ్రీవారి బ్రహ్మ రథంపై ప్రతిష్టించారు. స్వామివారికి నిత్య కై ంకర్య సేవలు నిర్వహించిన మీదట బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్య హవచనం, వాస్తు హోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ చేశారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లారు.


