● నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: ‘జిల్లా కేంద్రానికి వస్తున్న రెవెన్యూ సమస్యల్లో అత్యధికంగా మండల స్థాయిలో పరిష్కారం కావాల్సినవే. భూ సమస్యలను పరిష్కరిస్తున్న తీరు సంతృప్తికరంగా లేదు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతగా పరిష్కరించాలి’ అని కలెక్టర్ ఆనంద్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌పై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ మలోలతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు తమ పరిధిలో మెరుగైన సేవలు అందించి అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. కోర్టు కేసులు, పరిష్కరించడం సాధ్యం కానివాటి గురించి అర్జీదారులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. అప్పుడే రెవెన్యూ క్లినిక్‌కు వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయన్నారు. మండలస్థాయిలో సమస్య పరిష్కారమైనప్పుడే ప్రజల్లో అధికారులపై నమ్మకం పెరగుతుందన్నారు. సమావేశంలో ఆర్డీఓలు వసంతబాబు, శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, పరిష్కార వేదిక ఇన్‌చార్జి జయశ్రీ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
భూ సమస్యలు పరిష్కరించండి
కార్యాలయం చుట్టూ తిరిగి అర్జీలు అందజేస్తున్నా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇకనైనా సమస్య పరిష్కరించాలంటూ అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఆనంద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికలో భాగంగా భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ప్రజల నుంచి 463 అర్జీలు అందగా వాటిలో భూ సమస్యలకు సంబంఽధించి 326 అర్జీలు, ఇతర సమస్యలపైన 137 అర్జీలు అందాయి.


