గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి బిహార్ రాష్ట్రంలోని కతిహార్ జంక్షన్ నుంచి యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 31 వరకు మంగళవారాల్లో (4 సర్వీసులు) యశ్వంత్‌పూర్ జంక్షన్ (06571) నుంచి ఉదయం 7 గంటకు బయలుదేరి మూడవ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కతిహార్ జంక్షన్‌కు చేరుతుందన్నారు. ఇక తిరుగు ప్రయాణంలో కతిహార్ జంక్షన్ (06572) నుంచి ఈ నెల 13 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రతి శుక్రవారం (4 సర్వీసులు) ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మూడవ రోజు తెల్లవారుజామున 4 గంటలకు యశ్వంత్‌పూర్ జంక్షన్‌కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మార్కాపూర్‌రోడ్డు, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఏసీ త్రీటైర్‌తోపాటు స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
సర్వే ఏడీగా విజయసారథి
అనంతపురం అర్బన్: సర్వే భూ రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విజయసారథికి పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీగా ఉన్న రూప్లానాయక్ గతనెల 28న ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా ఇన్‌స్పెక్టర్ సర్వేగా ఉన్న విజయసారథిని ఏడీ (ఎఫ్‌ఏసీ)గా నియమించారు.
ఓపెన్ పది హాల్ టికెట్ల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ద్వారా ఈ నెల 16 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు హాల్‌టికెట్లను ఏపీ ఓపెన్‌స్కూల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. అలాగే ఏఐ సెంటర్ల నుంచి కూడా పొందవచ్చన్నారు. వాట్సాప్–మనమిత్ర ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 95523 00009కు ‘ఏజీ’ అని మెసేజ్ పంపాలి. ‘చూస్ సర్వీస్’ లేదా ‘సేవను ఎంచుకోండి’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘ఎడ్యుకేషన్ సర్వీస్’ లేదా ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘ఏపీ ఓపెన్‌స్కూల్ ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, మార్చ్–2026 హాల్ టికెట్స్’ను ఎంచుకోవాలి. తర్వాత విద్యార్థి ‘అడ్మిషన్ నంబరు, పుట్టినతేదీ’ నమోదు చేయాలి. అనంతరం ‘కన్ఫమ్’పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుందని డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ తెలిపారు.
‘పది’ పరీక్షల నిర్వహణపై నేడు శిక్షణ
పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు మంగళవారం ఒక్కరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటలకు నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో ప్రారంభమయ్యే శిక్షణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు తప్పకుండా రావాలని డీఈఓ ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ పేర్కొన్నారు. ప్రతి కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. 7, 8, 9, 10 తరగతి, ఇంటర్ రెండో సంవత్సరంలో ప్రస్తుతం ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. https://apkgbv.apcfss.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్ ద్వారా అందజేసే దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారని పేర్కొన్నారు. 13 నుంచి 17 వరకు సంబంధిత కేజీబీవీల్లో ధ్రువపత్రాలు పరిశీలించి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.


