బొమ్మేపర్తిలో ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ ప్రారంభం
రాప్తాడురూరల్: రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ సోమవారం ప్రారంభమైంది. గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇది రాయలసీమలో 61వ శాఖ. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏజీఎం, రీజనల్ మేనేజర్ పి.అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ బ్యాంకర్ మ్యాగజైన్ నిర్వహించిన ‘బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్–2025’ దేశంలోనే ఉత్తమ బ్యాంక్‌గా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్రంలో బ్యాంకు ఉనికి మరింత విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. బొమ్మేపర్తి శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఏఈకే కిశోర్, బొమ్మేపర్తి శాఖాధిపతి కె.పురుషోత్తంనాయక్, బత్తలపల్లి, కేశేపల్లి, తాడిపత్రి శాఖల అధిపతులు పాల్గొన్నారు.
తండ్రిపై కుమారుడి దాడి
పెద్దవడుగూరు: మండల పరిధిలోని జి.వెంకటాంపల్లిలో సోమవారం తండ్రి శ్రీనివాసులుపై అతని కుమారుడు సాయి కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు తెలిపిన మేరకు.. ఆస్తి తన పేరిట రాయాలంటూ కొన్ని రోజులుగా కుమారుడు సాయి తన తండ్రి శ్రీనివాసులుపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై సోమవారం సాయంత్రం తండ్రీకుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆక్రోశంతో సాయి తన తండ్రి శ్రీనివాసులు తలపై కట్టెతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు పెద్దవడుగూరు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ ఆంజినేయులు తెలిపారు.
మరణించి.. మరో ఇద్దరికి చూపు
వజ్రకరూరు: ఆమె మరణించినా మరో ఇద్దరికి చూపు ప్రసాదించింది. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరు గ్రామానికి చెందిన ఎం.భాగ్యలక్ష్మిదేవి (70) రెండు రోజుల క్రితం ఇంట్లో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. ఈ క్రమంలో మృతురాలు భాగ్యలక్ష్మిదేవి నేత్రాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు. ఆస్పత్రి ప్రతినిధి సమాచారం మేరకు ఐ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర అక్కడికి చేరుకుని నేత్రాలను సేకరించారు. తమ తల్లి చివరి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుమారులు ఎం.రమేష్, ఎం.విశ్వ నాథ్, కుమార్తెలు శ్రీదేవి, విజయలక్ష్మి, ఉషారాణి తెలిపారు. వారికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కుళ్లాయప్ప ఐ రిట్రీవల్ సెంటర్ వారు కృతజ్ఞతలు తెలిపారు.
బొమ్మేపర్తిలో ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ ప్రారంభం
బొమ్మేపర్తిలో ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ ప్రారంభం


