ఈ బడ్జెట్‌తో ఒరిగేదేమీ లేదు
అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి, వెనుకబడిన ప్రాంతాలకు ఒరిగేదేమీ లేదని సీపీఎం జాతీయ నాయకుడు వెంకట్ మండిపడ్డారు. సోమవారం స్థానిక క్లాక్‌టవర వద్ద ఆ పార్టీ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి అధ్యక్షతన నాయకులు మట్టిమూకుడులు (బొచ్చెలు) చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి, వెనుకబడిన అనంతపురం జిల్లాకు ఏ మాత్రం ప్రయోజనాలు చేకూర్చలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కంటే నిధులు తగ్గించారన్నారు. అరకొర నిధులతో ఈ ఏడాది ఆఖరుకు ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. నిర్వాసితుల పునరావాసానికి రూ.21 వేల కోట్లు అవసరమని, అందులో ఎంత కేటాయించారో చెప్పలేదన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత పెట్టారన్నారు. వీబీ–జీ–రామ్‌జీ చట్టం ప్రకారం కేంద్రం తన 60 శాతం వాటా కింద రూ.1.80 లక్షల నిధులు కేటాయించాల్సి ఉండగా రూ.90 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. ధాన్యం, గోధుమలు పండించే రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదన్నారు. కడప ఉక్కు, వెనుకబడిన ప్రాంతాలకు పూర్తి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం నుంచి 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఏం సాధించారని ప్రశ్నించారు. వ్యాపారులు చట్టసభల్లోకి వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుందని విమర్శించారు. మోదీ సర్కార్, చంద్రబాబు సర్కార్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, నాయకులు ముత్తుజా, సూరి, ఇర్ఫాన్, వలి, ఓబుళేసు, శంషాద్, పద్మావతి, నాగేంద్రమ్మ, అశ్వని, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసినా సీఎం చంద్రబాబుకు పట్టదా?
సీపీఎం జాతీయ నాయకుడు
వెంకట్ ధ్వజం


