కోళ్లఫాం షెడ్డులో అగ్ని ప్రమాదం
వజ్రకరూరు: కోళ్లఫాం షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగి రూ.15 లక్షల నష్టం వాటిల్లిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరుకు చెందిన రైతు గోపి జయరామిరెడ్డి తన వ్యవసాయం పొలంలో కోళ్లఫాం షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల షెడ్డులో వేరుశనగ, కంది, పప్పుశనగ పొట్టుతో పాటు వరిగడ్డి నిల్వ చేశాడు. దీంతోపాటు సొప్పు కటింగ్ మిషన్, ఇతర వ్యవసాయ పనిముట్లు, పెంకులు, తీర్లు ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున షెడ్డులో మంటలు ఎగిసిపడుతుండడం గమనించిన స్థానికులు వెంటనే రైతు గోపి జయరామిరెడ్డికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న గోపిజయరామిరెడ్డి, కుటుంబీకులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుంతకల్లు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే షెడ్డులోని గడ్డితో పాటు వ్యవసాయ పనిముట్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి, ఏఎస్‌ఐ రమేష్, వీఆర్‌ఓ మారెన్న తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కాలిబూడిదైన వేరుశనగ పొట్టు, వ్యవసాయ పనిముట్లు
రూ. 15 లక్షల నష్టం


