ప్రాణం తీశారు.. న్యాయం చేయండి
తాడిపత్రి టౌన్: వారం రోజుల క్రితం తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణి మృతి చెందిన ఘటన మరువక ముందే మరో ప్రైవేట్ ఆస్పత్రిలో రైతు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. అందించిన చికిత్సకు సంబంధించిన రికార్డులు మాయం చేయడంతో పాటు ‘నీ ఇష్టం వచ్చినోనికి చెప్పుకో ఫో’ అంటూ సదరు వైద్యుడు బెదిరింపులకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. వివరాల్లోకి వెళితే... అనారోగ్యంతో బాధపడుతున్న తాడిపత్రి మండలం అయ్యవారిపల్లికి చెందిన వీరభద్రయ్య (50)ను మూడు రోజుల క్రితం కుటుంబసభ్యులు తాడిపత్రిలోని కాంచని ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం అర్ధరాత్రి వీరభద్రయ్య మృతి చెందాడు. ఇదే విషయాన్ని అక్కడి వైద్యులు మృతుడి కుటుంబసభ్యులకు తెలపడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వీరభద్రయ్య మరణించాడని ఆరోపిస్తూ ఆదివారం ఉదయం ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ.. చికిత్స సమయంలో పరిస్థితి విషమిస్తుండడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్తామని ప్రాధేయపడిన తాను బతికిస్తానని ఆస్పత్రి వైద్యుడు నమ్మబలికారన్నారు. రూ.వేలకు వేలు డబ్బు లాక్కొన్ని చివరకు ప్రాణాలు తీశారని, మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే చికిత్సకు సంబంధించిన రికార్డులు మాయం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలా ఎందు చేశారని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినోనికి చెప్పుకోమంటూ వైద్యుడు బెదిరింపులకు దిగాడంటూ ఆరోపించారు. సమాచారం అందుకున్న సీఐ ఆరోహణరావు అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. కాగా, కాంచని ఆస్పత్రిలో దౌర్జన్యానికి పాల్పడి పరికరాలు ధ్వంసం చేశారని, దీంతో రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందంటూ మృతుడి బంధువులపై ప్రైవేట్ డాక్టర్స్ అసిసోసియేషన్ వైద్యులు ఫిర్యాదు చేశారు. ఘటనకు నిరసనగా సోమవారం తాడిపత్రిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మరో పది రోజుల పాటు రాత్రి 7 గంటల తర్వాత వైద్య సేవలు నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంచని ఆస్పత్రి ఎదుట బాధితుల ధర్నా


