తక్కువ ధరకే బంగారమంటూ టోకరా | - | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకే బంగారమంటూ టోకరా

Jan 29 2026 6:22 AM | Updated on Jan 29 2026 6:22 AM

తక్కువ ధరకే బంగారమంటూ టోకరా

తక్కువ ధరకే బంగారమంటూ టోకరా

రూ.8 కోట్ల వరకు వసూలు చేసిన వ్యక్తి

పోలీసుల అదుపులో నిందితుడు..

తాడిపత్రి టౌన్‌: బంగారం ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి తక్కువ ధరకు బంగారం తెచ్చిస్తానని అమాయకులు, వ్యాపారులకు ఆశ చూపాడు. ప్రారంభంలో తక్కువ ధరకే ఇచ్చాడు. నమ్మకంతో డబ్బు ఇచ్చిన వారికి టోకరా వేయాలనుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకునన్నాడు. వివరాలిలా ఉన్నాయి. కడపకు చెందిన ఆరీఫ్‌ గతంలో దుబాయిలో పనిచేశాడు. మూడేళ్ల కిందట తాడిపత్రికి వలస వచ్చి ఉంటున్నాడు. ఏడాది కాలంగా బంగారు వ్యాపారంలోకి దిగాడు. దుబాయి నుంచి ప్రొద్దటూరుకు దిగుమతి అయ్యే బంగారు పది గ్రాములపై రూ.5వేల నుంచి రూ.10 వేల దాకా తక్కువకే వస్తుందని తాడిపత్రిలోని పలువురు జ్యువెలరీ వ్యాపారులతో పాటు తాను నివాసముంటున్న రాయచూర్‌ కాలనీవాసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే బంగారు ధరలు అంతకంతకూ పైకి ఎగబాకుతుండటంతో వ్యాపారులతో పలువురు ఆరీఫ్‌ వైపు మొగ్గు చూపారు. కొంతమందికి తక్కువ ధరకే బంగారు తెచ్చివ్వడం ద్వారా నమ్మకం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు సమాచారం. డబ్బు తీసుకున్న వారికి రొటేషన్‌ పద్ధతిలో బంగారు ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో నగదు లావాదేవీలు ఆగిపోయాయి. ఇదే క్రమంలో బంగారు తీసుకురాలేకపోయాడు. దీంతో డబ్బు చెల్లించిన వారి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఆరిఫ్‌ బుధవారం వైఎస్సార్‌ కడప జిల్లా తాళ్లప్రొద్దటూరులోని రైల్వే ట్రాక్‌ వద్ద తిరుగుతూ ఉండటంతో అక్కడి పోలీసులు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. తనకు డబ్బు కోసం ఒత్తిళ్లు పెరగడంతో ఇలా వచ్చేశానని చెప్పుకొచ్చాడు. అనంతరం పోలీసులు అతడిని తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బాధితులు స్టేషన్‌కు ఒక్కొక్కరుగా చేరుకుని సీఐ ఆరోహణరావు వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆరిఫ్‌ను నమ్మి రూ.8కోట్ల వరకు అప్పజెప్పామని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా వసూలు చేసిన డబ్బుతో కువైట్‌కు వెళ్లిపోవడానికి ఆరిఫ్‌ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement