ధర పెంచి.. కార్డుదారులను వంచించి
అనంతపురం అర్బన్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు గోధుమపిండి పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల నుంచి ప్రారంభించింది. అయితే అది ఒక్క జిల్లా కేంద్రంలోని కార్డుదారులకే పరిమితం చేసి, గ్రామీణ ప్రాంత పేదలను నిరాశపర్చింది. అదికూడా రేషన్ పంపిణీ ప్రారంభమై మూడు రోజులైనా సగం దుకాణాలకు గోధుమపిండి అందనేలేదు. అయినా సరే గొప్పలు చెప్పుకోవడంలో సర్కారు తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కిలో గోధుమపిండి రూ.16కు అందిస్తే.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రూ.4 పెంచి కిలో రూ.20 వసూలు చేస్తోంది. ధర పెంచిన సర్కారు నయవంచనపై కార్డుదారులు భగ్గుమంటున్నారు.
కందిపప్పు పంపిణీకి మంగళం
చౌక దుకాణాల ద్వారా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్డుదారులకు క్రమం తప్పకుండా ప్రతినెలా కిలో కందిపప్పును రూ.67తో పంపిణీ చేస్తూ వచ్చింది. కార్డుదారులకు కిలో చొప్పున ప్రతి నెల జిల్లా కోటా 625 టన్నులు ఉండింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కందిపప్పు పంపిణీకి మంగళం పాడింది. కందిపప్పు కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదంటూ అధికారులు ఐదారు నెలలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈలోగా కార్డుదారులు ఆ విషయాన్నే మర్చిపోయారు. ఇదే అదనుగా కందిపప్పు పంపిణీ అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా మరుగునపడేసింది.
జొన్నలు, రాగులదీ అదేదారి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతినెలా జొన్నలు, రాగులును కార్డుదారులకు పంపిణీ చేస్తూ వచ్చింది. జిల్లాకు ప్రతి నెల జొన్నలు కోటా 1,100 టన్నులు, రాగులు కోటా 1,100 టన్నులు ఉండింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్క సరుకూ తగ్గిస్తూ వచ్చింది. తొలుత కందిపప్పు పంపిణీకి మంగళం పాడి... జొన్నలు, రాగుల పంపిణీని అదే దారి పట్టించింది. ప్రస్తుతం ఎక్కడా జొన్నలు, రాగులూ ఇవ్వకపోయినా అధికారులు మాత్రం కొన్ని దుకాణాలకు సరఫరా చేస్తున్నామంటూ చెప్పుకొస్తుండడం విడ్డూరంగా ఉంది.
జిల్లా కేంద్రానికే గోధుమ పిండి పరిమితం
సగానికిపైగా చౌక దుకాణాలకు నేటికీ చేరని సరుకు
రేషన్‌లో కందిపప్పు, జొన్నలు, రాగులకు మంగళం పాడిన ప్రభుత్వం
ధర పెంచి.. కార్డుదారులను వంచించి


