బైక్‌లో చీర ఇరుక్కుని మహిళ మృతి
బ్రహ్మసముద్రం: బైక్‌లో చీర ఇరుక్కుని కిందపడడంతో మహిళ మృతి చెందిన ఘటన బ్రహ్మసముద్రం మండలంలో జరిగింది. వివరాలు.. మండల పరిధిలోని బొమ్మగానిపల్లికి చెందిన హరిజన జీవిత (29), దొనతిమ్మప్ప దంపతులు. వీరికి ఒక కుమారుడు సంతానం. దంపతులి ద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. దొనతిమ్మప్ప కళ్యాణదుర్గంలో పెయింటింగ్ పనులకు వెళ్తుండగా, జీవిత అక్కడి ఓ హోటల్‌లో పనిచేస్తూ ఉండేది. దంపతులిద్దరూ తమ గ్రామం నుంచి నిత్యం బైకులో రాకపోకలు సాగిస్తుండేవారు. శుక్రవారం రాత్రి కళ్యాణదుర్గంలో పనులు ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. బాలావారి తోట సమీపంలో జీవిత చీర కొంగు ద్విచక్రవాహన చక్రంలో ఇరుక్కోవడంతో అదుపుతప్పి భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. దొనతిమ్మప్పకు స్వల్ప గాయాలు కాగా జీవితకు తలపై బలమైన గాయం తగిలింది. వెంటనే దొనతిమ్మప్ప తన బైకులోనే జీవితను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ జీవిత మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య మృతురాలి కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. ఎంపీపీ కంభం చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు అభిలాష్ రెడ్డి, సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేష్‌నాయక్ తదితరులు సంతాపం తెలియజేశారు.


