ఆయకట్టు స్థిరీకరణ ఎన్నడో?
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ ఆయకట్టు స్థిరీకరణ నేటికీ కలగానే మిగిలింది. ఉమ్మడి జిల్లాలో కరువు కాటకాలను శాశ్వతంగా పారదోలడమే లక్ష్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. 2004–05 మధ్య కాలంలో అత్యల్ప వర్షపాతంతో జిల్లాలో కరువు విలయతాండవం చేసింది. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. తాము అధికారంలోకి వస్తే హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి, జీడిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. 2005లో రూ.వంద కోట్ల నిధులు కేటాయించి సుమారు 8.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1.67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జీడిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. అదే సమయంలో 2009 నాటికి హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేయించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి ఏడు లిఫ్టుల ద్వారా 2012 నుంచి నిరంతరంగా జీడిపల్లికి కృష్ణా జలాలు వస్తున్నాయి. రిజర్వాయర్ గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకోగానే తూము ద్వారా కొంత, మరువ ద్వారా మరికొంత నీటిని దిగువన ఉన్న పీఏబీఆర్‌కు వదులుతున్నారు. దశాబ్ద కాలంగా హంద్రీనీవా రెండో దశ కాలువకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
ఆయకట్టు
స్థిరీకరణ జరిగితే సస్యశ్యామలమే
నిండు కుండను తలపిస్తున్న
జీడిపల్లి రిజర్వాయర్
2012 నుంచి రిజర్వాయర్‌కు కృష్ణాజలాల రాక
ఆయకట్టు స్థిరీకరణకు
దశాబ్ద కాలంగా ఎదురు చూపు
జీడిపల్లి రిజర్వాయర్ పరిధిలోని బెళుగుప్ప పరిసర ప్రాంతాల్లోనే 30 వేల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది. అయితే మండలంలో ఒక్క బెళుగుప్ప, శీర్పి చెరువులు మినహా గంగవరం, బ్రాహ్మణపల్లి, శ్రీరంగాపురం, గుండ్లపల్లి, కోనాపురం, నరసాపురం చెరువులకు రిజర్వాయర్ నుంచి నీరు అందించడంతో పాటు ఆయకట్టును సాగులోకి తీసుకువస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.


