రోడ్డు ప్రమాదంలో అవ్వ, మనువడి దుర్మరణం
పామిడి: ఐదు నిమిషాలు ఉంటే అవ్వ, మనవడు సురక్షితంగా ఇంటికి చేరుకునేవారు. ఇంతలో ఆటో రూపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని మృత్యువు కబళించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మండలంలోని ఎద్దులపల్లికి చెందిన టీడీపీ నేత, రైతు ఆలూరి ప్రతాప్‌రెడ్డి తల్లి ఆలూరి కాంతమ్మ (72), కుమారుడు ఆలూరి లోకేశ్వర్‌రెడ్డి (22) దుర్మరణం చెందారు. ఎస్‌ఐ బీ రవిప్రసాద్ వివరాలమేరకు.. పనిమీద ఆలూరి ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు వేర్వేరు ద్విచక్ర వాహనాల్లో అనంతపురం వెళ్లారు. పనిముగించుకొని ప్రతాప్‌రెడ్డి, అతని భార్య మాధవి ఒక ద్విచక్ర వాహనంలోనూ, అతని తల్లి ఆలూరి కాంతమ్మ, రెండో కుమారుడు ఆలూరి లోకేశ్వర్‌రెడ్డి (అవ్వ, మనవడు) బుల్లెట్ ద్విచక్ర వాహనంపై ఎద్దులపల్లికి బయలుదేరారు. ఎద్దులపల్లి నుంచి గుత్తి వైపునకు రేషన్ బియ్యంతో కల్లూరుకు చెందిన రమేష్ ఆటో బయలుదేరి వచ్చింది. అయితే బ్రహ్మయ్య తోట సమీపంలోకి వచ్చేసరికి ఆటో– ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కాంతమ్మ, లోకేశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లోకేశ్వర్‌రెడ్డి ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. రోడ్డు ప్రమాదంలో అవ్వ, మనవడు ఒకేసారి చనిపోవడంతో ఎద్దులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్ రమేష్ స్వచ్ఛందంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలు కాంతమ్మ లోకేశ్వరరెడ్డి (ఫైల్)
రోడ్డు ప్రమాదంలో అవ్వ, మనువడి దుర్మరణం


