ఎప్పుడు కూలుతాయో?
● దుస్థితిలో హెచ్చెల్సీ బ్రిడ్జీలు
● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
కణేకల్లు: హెచ్చెల్సీ బ్రిడ్జీలు శిథిలావస్థకు చేరున్నాయి. ఎప్పుడు కూలతాయో తెలీని పరిస్థితి నెలకొంది. ఈ యేడాది అత్యంత అవసరంగా 10 బ్రిడ్జిలను గుర్తించి పనులు ప్రారంభించినా కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మరో 8 బ్రిడ్జిలు ఆగిపోయాయి. మరో 44 బ్రిడ్జీలు దుస్థితికి చేరుకున్నాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాటిపై రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ఘోరం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొన్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు.
60 ఏళ్ల క్రితం నాటివి...
హెచ్చెల్సీ కాలువపై 60 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జీలు, అండర్ టన్నల్‌లు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. హెచ్చెల్సీ ప్రధాన కాలువ ఆంధ్రా సరిహద్దు 105 కి.మీ వద్ద ప్రారంభమై ఉరవకొండ పరిధిలోని 189 కి.మీ వద్ద ముగిస్తోంది. హెచ్చెల్సీ నిర్మాణ సమయంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్యలో బ్రిడ్జీలు, వంకలు, వాగులపై యూటీలు (అండర్ టన్నల్స్) నిర్మించారు. బ్రిడ్జిలు 33, యూటీలు 21, అక్విడెక్ట్‌లు 5 నిర్మించారు. మీన్లహళ్లి వద్ద ఐదేళ్ల క్రితం బ్రిడ్జి కూలిపోగా... రెండేళ్ల క్రితం కణేకల్లు చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ బ్రిడ్జి వరిధాన్యంతో ఈచర్ వాహనం వస్తున్న సమయంలో కుప్పకూలింది. దీంతో గంగలాపురం, ఆదిగానిపల్లి, రచ్చుమర్రి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వాహనాలతో ముప్పులు
హెచ్చెల్సీ బ్రిడ్జీలపై నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో యూటీ, బ్రిడ్జిల వద్ద ఉన్న రాళ్లు వదులుగా మారి గోడలు బలహీనంగా మారాయి. యూటీలు, అక్విడెక్ట్‌ల వద్ద తరచూ నీరు లీక్ అవుతుండటంతో హెచ్చెల్సీ అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. యూటీల పక్కనే రాళ్లతో నిర్మించిన ప్రొటక్షన్ వాల్స్ కూడా బలహీనంగా మారాయి. యూటీలు పటిష్టంగా ఉంటనే హెచ్చెల్సీ నీరు రాష్ట్రానికి సకాలంలో తీసుకోరావడానికి వీలవుతోంది. యూటీలకు గండ్లు పడితే నీరు తీసుకోవడం చాలా కష్టమని రైతులు చెబుతున్నారు. బొమ్మనహళ్ మండలంలోని ఉంతకల్లు సమీపంలో 113/507 కిలోమీటర్ వద్ద డిసెంబర్ 7న యూటీకి గండిపడగ్గా... జూలై 28న నాగేపల్లి అక్విడెక్ట్ వద్ద కాలువ గట్టు కోత గురైన విషయం విధితమే.
జనవరి నెలాఖరుకు నీరు బంద్
హెచ్చెల్సీకి జనవరి నెలాఖరికి నీటి సరఫరా బంద్ కానున్నాయి. ఈలోపు హెచ్చెల్సీ అధికారులు అత్యవసర బ్రిడ్జిలను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కణేకల్లులోని రామనగర్, మాల్యం, గనిగెర, ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటర్ వద్ద బ్రిడ్జిలు అతి ముఖ్యమైనవి. ప్రమాదాలు జరిగి సమస్యలు తలెత్తక ముందే ఈ బ్రిడ్జిల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కణేకల్లు మండలం మాల్యం వద్ద
దుస్థితిలో హెచ్చెల్సీ బ్రిడ్జి
బొమ్మనహాళ్ మండలంలోని ఉంతకల్లు యూటీ వద్ద గండిపడిన దృశ్యం (ఫైల్)
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
బ్రిడ్జిలు, యూటీలు అధ్వాన్నస్థితికి చేరుకొన్న విషయాన్ని హెచ్చెల్సీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయమని ఆదేశించడంతో ఆ పనిలో నిమగ్నమయ్యాం. అత్యవసరమైన బ్రిడ్జిలను గుర్తించాం. నిధులు మంజూరు చేస్తే కొత్త బ్రిడ్జిలు, యూటీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.
– దివాకర్‌రెడ్డి, హెచ్చెల్సీ డీఈఈ
ఎప్పుడు కూలుతాయో?
ఎప్పుడు కూలుతాయో?
ఎప్పుడు కూలుతాయో?


