ఎమ్మెల్యే అమిలినేని తిరుగుబావుటా
కళ్యాణదుర్గం: చంద్రబాబు సర్కార్‌పై సొంత పార్టీకి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పారిశుధ్య పరికరాలు పంపిణీ చేసి తన నియోజకవర్గంలో పంపిణీపై చిన్నచూపు చూడటంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కి వెళ్లిపోయారు. కళ్యాణదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీలలో పారిశుధ్య పనులకు అవసరమైన పరికరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. అయితే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కాకుండా కేవలం మండలానికి రెండు గ్రామాలకు చొప్పున మాత్రమే పరికరాలు వచ్చాయని డీఎల్‌డీఓ నాగేశ్వరరావు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అమిలినేని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పంపిణీ చేసినప్పుడు తన నియోజకవర్గంలో మాత్రం ఎందుకు ఇలా కొన్ని గ్రామాలకే ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసంతృప్తితో ఉన్నానని, ఇలాంటి కార్యక్రమానికి రాకుండా ఉండాల్సిందన్నారు. కళ్యాణదుర్గానికి జరిగిన అన్యాయంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు సైతం కళ్యాణదుర్గం వైపు చూడకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. త్వరలోనే కలెక్టర్‌తో చర్చిస్తానని, తాను కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్తున్నానని మైకులో ప్రకటించి అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెనుదిరిగిపోయారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అరకొరగా వచ్చిన పంచాయతీ పారిశుధ్య పరికరాలు
కార్యక్రమంలో అసహనంతో మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
టీడీపీలో
కలకలం
సొంత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి
కళ్యాణదుర్గంపై చిన్నచూపు
చూస్తున్నారని మండిపాటు
కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రభుత్వం, అధికారులపై అసహనం వ్యక్తం చేసి..కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్తున్నట్లు ప్రకటించడంతో టీడీపీలో కలకలం రేపుతోంది. కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా.. కొంత కాలంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈ– స్టాంపుల కుంభకోణం, సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపం, మద్యం షాపుల టెండర్లు, తదితర పరిణామాల నేపథ్యంలో అమిలినేని ప్రతిష్ట మసకబారింది. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గించిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఏడాదిన్నర కాలంలోనే చంద్రబాబు సర్కారుపై సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబావుటా ఎగురవేసి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే అమిలినేని తిరుగుబావుటా


