నకిలీ సర్టిఫికెట్లు హ్యాకర్ల పనే
బత్తలపల్లి: రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్న నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం హ్యాకర్ల పనేనని ప్రాథమికంగా తేలింది. పోట్లమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని బత్తలపల్లి–3 గ్రామ సచివాలయం లాగిన్ నుంచి 1,982 బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన అంశంపై ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించడంతో అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. అయితే పోట్లమర్రి పరిధిలో ఉన్న బత్తలపల్లి–3 సచివాలయానికి బర్త్ సర్టిఫికెట్ల జారీకి లాగిన్ ఐడీ లేదని తెలుసుకున్నారు. దీంతో హ్యాకర్లు సచివాలయ లాగిన్ ఐడీని కొత్తగా క్రియేట్ చేసి మరీ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసుకున్నట్లు గుర్తించారు.
నూతనంగా ఏర్పడిన పంచాయతీ
బత్తలపల్లి పంచాయతీ నుంచి విడిపోయి పోట్లమర్రి గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడింది. గతంలో బత్తలపల్లి పంచాయతీ పరిధిలో బత్తలపల్లి–1, బత్తలపల్లి–2, బత్తలపల్లి–3 గ్రామ సచివాలయాలు ఉండగా.. పోట్లమర్రి పంచాయతీ ఏర్పడ్డాక బత్తలపల్లి –3 గ్రామ సచివాలయాన్ని పోట్లమర్రి పరిధిలో చేర్చారు. వాస్తవానికి పోట్లమర్రి పంచాయతీ ఏర్పడకముందు నుంచీ బత్తలపల్లి–1 సచివాలయంలో మాత్రమే బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. పోట్లమర్రి పంచాయతీగా ఏర్పడినప్పటికీ ఆ పంచాయతీ పరిధిలోని బర్త్ సర్టిఫికెట్లు కూడా బత్తలపల్లి–1 సచివాలయం నుంచే జారీ అవుతున్నాయి. బత్తలపల్లిలో ఆర్డీటీ ఆస్పత్రి ఉండడం వల్ల ఇక్కడ ఏడాదికి 5 వేలకుపైగానే బర్త్ సర్టిఫికెట్లు జారీ అవుతుంటాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు.. నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసుకునేందుకు పోట్లమర్రి పంచాయతీ పరిధిలోని బత్తలపల్లి–3 సచివాలయాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సచివాలయానికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేసే ఐడీ లేదని తెలిసిన హ్యాకర్లు.. దొంగ ఐడీ క్రియేట్ చేసి నకిలీబర్త్ సర్టిఫికెట్లు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
ఇతర రాష్ట్రాల వారివే ఎక్కువ..
పోట్లమర్రి గ్రామ పంచాయతీలో జారీ అయిన 1,982 బర్త్ సర్టిఫికెట్లన్నీ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లాలోని అగళి, బత్తలపల్లి మండలాల నుంచి జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లపై అధికారులు దృష్టి సారించారు. కాగా పోట్లమర్రి పంచాయతీ నుంచి జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లన్నీ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోట్లమర్రి పరిధిలోని బత్తలపల్లి–3 సచివాలయం లాగిన్ నుంచే పత్రాల జారీ
ఆ సచివాలయానికి బర్త్ సర్టిఫికెట్ల జారీకి లాగిన్ ఐడీ లేదంటున్న సిబ్బంది
నకిలీ సర్టిఫికెట్లు హ్యాకర్ల పనే


