ఇదెక్కడి తిరకాసు బాబూ! | - | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి తిరకాసు బాబూ!

Dec 18 2025 7:59 AM | Updated on Dec 18 2025 7:59 AM

ఇదెక్కడి తిరకాసు బాబూ!

ఇదెక్కడి తిరకాసు బాబూ!

పంటల నమోదు ప్రక్రియలో చంద్రబాబు సర్కారు కొత్త నిబంధనను తెరపైకి తీసుకువచ్చింది. కొత్త వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ పేరుతో ఖరీఫ్‌లో నమోదు చేసిన పంటలను మళ్లీ రబీ సీజన్‌ కింద చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంటల నమోదు ప్రక్రియ మొదటి నుంచి చేపట్టాల్సి రావడంతో ప్రభుత్వ తీరుపై ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో రబీ పంట నమోదు ప్రక్రియ చాలా ఆలస్యంగా మొదలైంది. అక్టోబర్‌ నుంచి రబీ సీజన్‌ మొదలు కాగా ఇప్పటికే 70 నుంచి 80 శాతం పంట సాగు కూడా పూర్తయింది. సీజన్‌ ప్రారంభమైన రెండున్నర నెలల తర్వాత పంట నమోదు ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ బుధవారం పంట నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఈ–క్రాప్‌ అనేది ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు కొత్త కాకున్నా... ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టడంతో సీరియస్‌గా ఉన్నారు.

సాఫ్ట్‌వేర్‌ మార్పుతో తిప్పలు

ఖరీఫ్‌లోనూ ఈ క్రాస్‌ నమోదు ప్రక్రియ చాలా ఆలస్యంగా ఆగస్టులో మొదలు పెట్టి నవంబర్‌ 20న ముగించారు. 6.1 వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ కింద అప్పట్లో అతికష్టంపై ఈ ప్రక్రియను ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు పూర్తి చేశారు. మధ్యలో సాంకేతిక సమస్యలు, సర్వర్ల సతాయింపుతో పాటు స్థానిక టీడీపీ చోటా.. మోటా నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతో చాలా ఇబ్బంది పడ్డారు. ఇక రబీ సీజన్‌ ప్రారంభం కావడంతో పెద్దగా సమస్య ఉండదని అందరూ భావించారు. అయితే గతంలో ఉన్న 6.1 వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్టికేషన్‌ బదులు ప్రభుత్వం కొత్తగా 6.5 వర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఖరీఫ్‌లో చేసిన విస్తీర్ణంతో పాటు రబీ విస్తీర్ణం, బీడు భూములు.. ఇలా మరోసారి పూర్తి స్థాయిలో పంట నమోదు చేయాలనే నిబంధన పెట్టి ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లపై పని ఒత్తిడి పెంచింది. గతంలో రబీలో సాగు చేసిన పంటలను మాత్రమే పంట నమోదు చేసేవారు. సాధారణంగా రబీ విస్తీర్ణం తక్కువగానే ఉండడంతో ఈ–క్రాప్‌ పెద్దగా సమస్య అనిపించేదికాదు. ఈ సారి ఖరీఫ్‌లో చేసినదంతా రబీలోనూ చేయాల్సిందేనని ఆదేశాలు రావడంతో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు కంగుతిన్నారు.

మరోసారి 20 లక్షల ఎకరాల్లో సర్వే

గత ఖరీఫ్‌లో మొత్తం 19.01 లక్షల ఎకరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. ఇందులో 8.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 3.14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 1,300 ఎకరాల్లో మల్బరీ, 7.21 లక్షల ఎకరాలను బీడు భూములుగా చూపించారు. రబీలో అన్ని పంటలు కలిపి 4 లక్షల ఎకరాలకు మించి ఉండదు. తాజాగా ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన భూములతో పాటు రబీ పంటలు, ఉద్యాన, మల్బరీ పంటలు, అలాగే బీడు భూములను కూడా సర్వే చేయాల్సి వచ్చింది. దీంతో మరోసారి 20 లక్షల ఎకరాల వరకూ సర్వే చేయాల్సి రావడం, అందులోనూ కొన్ని సాంకేతిక సమస్యలు నెలకొని ఉండడంతో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు తలలు బాదుకుంటున్నారు. వాస్తవానికి ఖరీఫ్‌లో కంది పంట ఏకంగా 3 లక్షల ఎకరాల వరకు సాగులోకి వచ్చినట్లు ఈ–క్రాప్‌లో నమోదైంది. ఇప్పుడు సాంకేతికంగా కంది పంటను తొలగిస్తే తప్ప ఈ–క్రాప్‌ నమోదు చేయడానికి కుదరదని ఆర్‌ఎస్‌కే అస్టిటెంట్లు అంటున్నారు. సాధారణంగా జనవరిలో కంది పంట కోతలు పూర్తవుతాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 28 లోపు రబీ ఈ–క్రాప్‌ ప్రక్రియ వంద శాతం పూర్తి కావాలని నిబంధన పెట్టడం తీవ్ర గందరగోళానికి తెరదీసింది. మొత్తమ్మీద రబీ ఈ–క్రాప్‌ తమకు గుదిబండగా మారిందని ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు వాపోతున్నారు.

ఖరీఫ్‌లో నమోదైన పంటలను రబీలోనూ ‘ఈ క్రాప్‌’

చేయాలంటూ నిబంధన

ప్రభుత్వ తీరుపై ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్ల సీరియస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement