వాహనం ఢీకొని 20 గొర్రెల మృతి
వజ్రకరూరు: ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో 20 గొర్రెలు మృతిచెందాయి. వివరాలు... గుంతకల్లు మండలం పులగుట్టపల్లికి చెందిన కాపరులు మహేష్, హేమంత్; రాము, సుధాకర్ బుధవారం తెల్లవారుజామున వజ్రకరూరు మండలం తట్రకల్లుకు గొర్రెల మందతో బయలుదేరారు. వజ్రకరూరు సమీపంలోకి చేరుకోగానే మందపైకి ఉరవకొండ నుంచి గుంతకల్లుకు వెళుతున్న ఐచర్ వాహనం దూసుకెళ్లింది. దీంతో 20 గొర్రెలు అక్కడిక్కడే మరణించాయి. మరో 33 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల మృతితో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.


