అభివృద్ధి శూన్యం
విడపనకల్లు: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా విరాజిలుతున్న విడపనకల్లు మండలం పాల్తూరులోని ఉండబండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ఆలనపాలన చూసే దేవదాయ శాఖ అధికారి పత్తా లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఈ ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలు రూ.20 లక్షలకు పైగానే ఉంటోంది. అయినా ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు.
పత్తా లేని ఈఓ
దేవదాయ శాఖ పరిధిలోని ఉండబండ వీరభద్రస్వామి ఆలయ నిర్వహణకు ఆ శాఖ తరఫున ప్రత్యేకంగా ఓ కార్యానిర్వహణాధికారి నియమితులయ్యారు. అయితే సదరు అధికారి ఎక్కడ ఉంటాడో.. ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఏడాదిలో రెండు, మూడు సార్లు మాత్రమే చుట్టపు చూపుగా వచ్చి వెళుతుంటారు. ప్రతి నెలా జీతాలు మాత్రం ఆలయ ఆదాయ వనరుల నుంచే తీసుకుంటున్నట్లు సమాచారం. దశాబ్దాల క్రితం ఆలయంలో ఉన్న సౌకర్యాలతోనే భక్తులు నేటికీ నెట్టుకొస్తున్నారు. కొత్తగా ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. సరైన మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అత్యవసర సమయంలో మహిళా భక్తులు సైతం ఆరు బయలు ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది.
అభివృద్ధి శూన్యం


