పొట్టేళ్ల దొంగ అరెస్ట్
తలుపుల: స్థానిక కుమ్మరపేటలో నివాసముంటున్న గంగయ్యకు చెందిన 19 పొట్టేళ్లను ఈ ఏడాది నవంబర్ 28న దుండగులు అపహరించుకెళ్లిన విషయం తెలిసిందే. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం కదిరి – పులివెందుల మార్గంలో బట్రేపల్లి వద్ద బుధవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో పోలీసులను గమనించి సుమోలో పొట్టేళ్లను తరలిస్తున్న వారు వాహనాన్ని ఆపి ఐదుగురు పారిపోయారు. ఆ సమయంలో వాహనంలో ఉన్న రాప్తాడు పంచాయతీ పరిధిలోని చిన్మయనగర్‌కు చెందిన ఎరికల నాగభూషణ కుమారుడు చిన్నా పట్టుబడ్డాడు. 19 గొర్రెలను స్వాధీనం చేసుకుని విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు.
తక్కువ వడ్డీతో పంట రుణాలు
కూడేరు: జిల్లా వ్యాప్తంగా స్టేట్ బ్యాంకుల్లో రైతులకు తక్కువ వడ్డీతో పంట రుణాలు అందజేయనున్నట్లు ఆ బ్యాంక్ రీజినల్ మేనేజర్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం కూడేరులోని స్టేట్ బ్యాంక్ వద్ద అన్నదాత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్‌ఎం రమేష్‌బాబు హాజరయ్యారు. పంట రుణాలే కాకుండా ఇతర రుణాలను అధిక మొత్తంలో తీసుకుని సకాలంలో కంతులు చెల్లిస్తున్న రైతులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంటల సాగు, విత్తనాలు కోసం రుణాలు ఇస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు, సోలార్ పంప్‌సెట్లు కొనుగోలుకు తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఈశ్వర్, సిబ్బంది ఎన్.లక్ష్మీనారాయణ, గోపీకృష్ణ, సుజినీ, బీఏ రాజు, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.


