ప్రజల భావోద్వేగాలపై దాడి
● కేంద్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు
అనంతపురం: గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు తొలగింపునకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ప్రజల భావోద్వేగాలపై ప్రత్యక్ష దాడి చేయడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. 2005 ఆగస్టు 23న భారత పార్లమెంట్ ఆమోదించి.. 2006 ఫిబ్రవరి 2న నార్పల మండలం బండ్లపల్లి వేదికగా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా గ్రామీణ పేద కుటుంబాలకు ఏటా కనీసం 100 రోజుల ఉపాధిని హక్కుగా కల్పించారని గుర్తు చేశారు. ఈ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. ఉన్న ఊరిలోనే పని చేసుకునే అవకాశం కలిగిందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, చెరువులు, కాలువలు, రోడ్లు వంటి పనులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన చట్టం ఇదేనని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టం పేరు మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని సూచించారు. ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ పేరు ఈ పథకానికి ఉండటం చారిత్రక అవసరమన్నారు. అటువంటి చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు.


