జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఐదుగురు ఫెన్సర్లు రాణించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిలో గీతిక, చేతన, లిఖిత, నవనీత్, సాత్విక్ ఉన్నారు. మణిపూర్‌లో త్వరలో జాతీయస్థాయి పోటీలు జరగనున్నాయని, ఇందులోనూ జిల్లా క్రీడాకారులు రాణించాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి మురళీకృష్ణ ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను మంగళవారం అనంతపురంలోని కార్యాలయంలో అభినందించారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కాలవ
అనంతపురం టౌన్: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును నియమించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను ఎమ్మెల్యేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కాలవ శ్రీనివాసులును ఎంపిక చేసినట్లు తెలిసింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష స్థానాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు కేటాయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అధికారికంగా పార్టీ అధిష్టానం వెల్లడించాల్సి ఉంది.
సేకరించిన ధాన్యానికి 45 శాతం చెల్లింపులు జరిగాయి
అనంతపురం అర్బన్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 4,951 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇందుకు సంబంధించి 45 శాతం చెల్లింపులు జరిగినట్లు జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ స్పష్టం చేశారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. జిల్లాలో 24 ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ నెల 16వ తేదీ నాటికి 412 మంది రైతుల నుంచి రూ.12.62 కోట్ల విలువైన 4,951.920 టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ రూ.5.71 కోట్లను 185 మంది రైతులకు చెల్లించామన్నారు. మిగిలిన 227 మందికి రూ. 6.91 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని ఒకట్రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యాన్ని విక్రయించడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే 79814 50565 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు
జూదరుల అరెస్ట్
గుంతకల్లు రూరల్: మండలంలోని కసాపురం గ్రామ శివారున సంగాల రోడ్డు వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టిన సమయంలో అర్ధరాత్రి పేకాట ఆడుతూ జూదరులు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.1,66,050 నగదు, చార్జింగ్ లైట్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జూదరుల అరెస్ట్‌లో చొరవ చూపిన కసాపురం ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి, ట్రైనీ ఎస్‌ఐ బాలముని, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.
పనుల్లో నాణ్యత లోపించరాదు
కూడేరు: పీఏబీఆర్ ధర్మవరం కుడికాలువ 4వ కిలోమీటర్ వద్ద ఇటీవల తెగిన కాలువ గట్టు మరమ్మతు పనులను క్వాలిటీ కంట్రోల్ డీఈ చంద్రశేఖర్, జేఈ ఓబుళపతి, ఇరిగేషన్ డీఈ విశ్వనాథ్ రెడ్డి, జేఈలు సుబ్రహ్మణ్యం, రమ్య మంగళవారం పరిశీలించారు. ఈ పనులకు రూ. కోటి అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ.90 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించరాదని సంబంధిత కాంట్రాక్టర్‌కు అధికారులు సూచించారు.
నేటి నుంచి
సంతోష్ ట్రోఫీ మ్యాచ్‌లు
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ సీనియర్ మెన్స్ నేషనల్ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ) ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రూప్ జీలో భాగంగా ఆంధ్రతో పాటు తమిళనాడు, అండమాన్, పాండిచ్చేరి జట్లు తలపడనున్నాయి.
పీఏబీఆర్ కుడి కాలువ గట్టు మరమ్మతులను పరిశీలిస్తున్న క్వాలిటీ కంట్రోల్ అధికారులు
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక


