అన్నదాతల ఆక్రందనలు పట్టవా..?
పుట్లూరు: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆక్రందనలు చేస్తుంటే చంద్రబాబు సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. అరటికి గిట్టుబాటు ధర లేక..పంట కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించ ఆత్మహత్య చేసుకున్న రైతు నాగలింగమయ్య అంత్యక్రియలు శుక్రవారం ఎల్లుట్ల గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా అనంత, శైలజానాథ్ హాజరై రైతు మృతదేహంపై పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రైతు నాగలింగమయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు. వ్యాపారంలో నష్టం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించడానికి కష్టపడేదానికన్నా రైతులను ఆదుకుని ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు సినిమా టికెట్లు పెంచడంపై ఉన్న శ్రద్ధ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటయ్యేలా మద్దతు ధర ప్రకటించడంపై ఎందుకు లేదని నిలదీశారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే.. తెల్లారకముందే డాక్టర్లను రప్పించి పోస్టుమార్టం చేయించి.. భారీపోలీసు బలగాల నడుమ అంత్యక్రియలు నిర్వహించాలని చూడటమంటే.. రైతు ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా అంగీకరించినట్లు కాదా అని ప్రశ్నించారు. రైతులు, కూలీలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ఎవ్వరూ అధైర్యపడవద్దని అన్నారు.
వక్రీకరించడం సిగ్గుచేటు
అరటికి గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై రైతు నాగలింగమయ్య పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటే వక్రీకరించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. నాగలింగమయ్య అరటి కాయల వ్యాపారని, నష్టం వచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రైతు ఆత్మహత్య జరిగిందన్నారు. రైతులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మీ కుటుంబానికి అన్యాయం చేయవద్దని చేతులెత్తి మొక్కారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ఎవ్వరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని భరోసా కల్పించారు. రైతు నాగలింగమయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, అప్పులు తీర్చాలని, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఇకనైనా ముందుకు వచ్చి గిట్టుబాటు ధరతో అరటి కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర వలంటీర్ కార్యదర్శి జయరాంరెడ్డి, ఎస్సీసెల్ నాయకులు శివశంకర్, మండల కన్వీనర్లు పొన్నపాటి మహేశ్వరరెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, పూల ప్రసాద్, ఖాదర్‌వలి, జెడ్పీటీసీ నీలం భాస్కర్, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు నాగలింగమయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తదితరులు
రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చేతులెత్తి మొక్కుతున్న మాజీ మంత్రి శైలజానాథ్, చిత్రంలో అనంత తదితరులు
సినిమా టికెట్లు పెంచేందుకు సై.. పంటలకు గిట్టుబాటు కల్పించేందుకు నై
చంద్రబాబు సర్కారుపై అనంత, శైలజానాథ్ ధ్వజం
అన్నదాతల ఆక్రందనలు పట్టవా..?


