కణేకల్లులో టీడీపీ మూకల దుశ్చర్య
● వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
కణేకల్లు: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కణేకల్లు నడిబొడ్డున ఉండటాన్ని టీడీపీ మూకలు జీర్ణించుకోలేకపోయాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి వైఎస్సార్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కడుతూ వస్తున్నారు. అయినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సహనం కోల్పోలేదు. దీన్ని అలుసుగా తీసుకుని మరో అడుగు ముందుకు వేశారు. శుక్రవారం రాత్రి కళేకుర్తికి చెందిన టీడీపీ కార్యకర్త ధనుంజయ్య బస్టాండ్ ప్రాంతంలోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నాడు. తొలుత చేయి విరగ్గొట్టాడు. స్థానిక ప్రజలు గమనించి తిరగబడ్డారు. అయితే అప్పటికే విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్త ధనుంజయ్యను అదుపులో తీసుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్త దుశ్చర్యను నిరసిస్తూ పోలీసు స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నా చేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పాటిల్ బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ఉషారాణి, జిల్లా ఉపాధ్యక్షులు మారెంపల్లి మారెన్న, కణేకల్లు పట్టణ మాజీ కన్వీనర్ టి.కేశవరెడ్డి, అనుబంధ సంఘాల నేతలు ఆర్కే బద్రీ, ఆదిసద్గురు చంద్రశేఖర్‌రెడ్డి, వేమనతోపాటు పలువురు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎస్‌ఐ నాగమధును కలసి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు గౌని ఉపేంద్రరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మాధవరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి..టీడీపీ వర్గీయుల దుశ్చర్యను ఖండించారు.
కణేకల్లులో టీడీపీ మూకల దుశ్చర్య


