విద్యార్థులను తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను తీర్చిదిద్దాలి

Dec 6 2025 7:42 AM | Updated on Dec 6 2025 7:42 AM

విద్యార్థులను తీర్చిదిద్దాలి

విద్యార్థులను తీర్చిదిద్దాలి

ఆత్మకూరు: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆత్మకూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం)– 3.0 నిర్వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర అంశాల్లో ఏది ఇష్టమో తెలుసుకుని అందులో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. తాను చదువుకునే రోజుల్లో తన తల్లి రోజూ గంట సమయం కేటాయించి.. ఏం చదువుతున్నానో తెలుసుకునేదన్నారు. తల్లి ప్రత్యేక కృషి వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, హెచ్‌ఎం లక్ష్మిదేవి, సర్పంచ్‌ వరలక్ష్మి, ఎంపీపీ సుబ్బర హేమలత, ఎంపీడీఓ లక్ష్మినరసింహ, ఎంఈఓలు నరసింహారెడ్డి, రామాంజినేయులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శివకుమార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు లావణ్య, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలతో అనర్థాలు

బాల్య వివాహాలను నిర్మూలించేందుకు దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘బాల వివాహ్‌ – ముక్త్‌ భారత్‌’ వంద రోజుల ఇంటెన్సివ్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్‌ సిబ్బందితో కలిసి కలెక్టర్‌ ఆనంద్‌ అవగాహన కల్పించారు.

దుగుమర్రి వీఆర్వో సస్పెండ్‌

శింగనమల(నార్పల): నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. రంగాపురానికి చెందిన రైతు నాగార్జునతో మ్యుటేషన్‌ కోసం వీఆర్వో రూ.38 వేలు లంచం డిమాండ్‌ చేసిన విషయం విదితమే. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి.. కలెక్టర్‌కు నివేదిక పంపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వీఆర్వో వెంకోబారావును సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నేడు సీఎస్‌ విజయానంద్‌ రాక

అనంతపురం అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.విజయానంద్‌ శనివారం అనంతపురం రానున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఉదయం 11.45 గంటలకు కలెక్టరేట్‌లో పీఎం కుసుమ్‌, పీఎం సూర్యాఘర్‌, ఎన్‌ఆర్‌ఈడీసీపీ ప్రాజెక్టులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించనున్నారని పేర్కొన్నారు. రాత్రికి అనంతపురంలోనే బసచేసి, ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ వెళతారని వెల్లడించారు.

ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

అనంతపురం మెడికల్‌: చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపరాదని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి హెచ్చరించారు. పుట్టినప్పటి నుంచే వారికి స్క్రీనింగ్‌ చేసి, ముందస్తు వైద్య సేవలందించాలని సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పీహెచ్‌సీల్లో విధులు నిర్వర్తించే సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఏ శిశువూ వైద్యపరమైన లోపాలతో పుట్టకూడదన్నారు. పిల్లల్లో ఎవరికై నా ఎదుగుదల సమస్య ఉంటే ప్రారంభదశలోనే గుర్తించి సేవలందిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్‌ శశిభూషణ్‌రెడ్డి, వైద్యులు డాక్టర్‌ శంకర్‌ నారాయణ, డాక్టర్‌ విష్ణుమూర్తి, డాక్టర్‌ రాధిక, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement