పలు చోట్ల షీప్‌ సొసైటీ ఎన్నికలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

పలు చోట్ల షీప్‌ సొసైటీ ఎన్నికలు వాయిదా

Dec 6 2025 7:42 AM | Updated on Dec 6 2025 7:42 AM

పలు చోట్ల షీప్‌ సొసైటీ ఎన్నికలు వాయిదా

పలు చోట్ల షీప్‌ సొసైటీ ఎన్నికలు వాయిదా

అనంతపురం అగ్రికల్చర్‌: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్‌ సొసైటీ) ఎన్నికలకు సంబంధించి తొలి విడతగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేకపోవడం, ఉన్న వాటిని అధికారులకు సమర్పించకపోవడం, అలాగే చిన్నపాటి తగాదాలు, అధికార పార్టీ ఒత్తిళ్లు తదితర కారణాలతో కంబదూరు మండలం చెన్నంపల్లి, కుందుర్పి మండలం బెస్తరపల్లి, కనగానపల్లి మండలం దాదులూరు, రొద్దం మండలం తురకలాపట్నం, శింగనమల మండలం సలకంచెరువుతో పాటు మరికొన్ని సొసైటీల్లో ఎన్నికలు ఆగినట్లు సమాచారం. ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికల అధికారుల ద్వారా పూర్తిస్థాయి సమాచారం శనివారం అందే పరిస్థితి ఉందని పశుసంవర్ధకశాఖ అధికారులు డాక్టర్‌ కేఎల్‌ శ్రీలక్ష్మి, డాక్టర్‌ గోల్డ్స్‌మన్‌ తెలిపారు. ఈ నెల 12న రెండో విడతగా 29 సొసైటీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. చాలాచోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు రంగంలోకి దిగి ఏకగ్రీవం చేసుకున్నట్లు చెబుతున్నారు.

పంపిణీకి సిద్ధంగా చేపపిల్లలు

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలోని అధీకృత రిజర్వాయర్లలో పెంపకం చేపట్టేలా వచ్చే వారంలో ఉచితంగా 50.34 లక్షల చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. గుమ్మగట్ట మండలంలోని బీటీపీ, గార్లదిన్నె మండలంలోని ఎంపీఆర్‌, రామగిరి మండలంలోని అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టులోకి గతంలో ఉచితంగా చేపపిల్లలు వదులుతూ వచ్చారు. ఈ సారి అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్ట్‌లో తగినన్ని నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను తప్పించి, ఆ స్థానంలో గండికోట రిజర్వాయర్‌ను చేర్చారు. దీంతో గండికోట రిజర్వాయర్‌లో 36.75 లక్షలు, ఎంపీఆర్‌లో 7.76 లక్షలు, బీటీపీలో 5.83 లక్షలు చేపపిల్లలు వదలనున్నారు. ఇవి కాకుండా ఎస్సీ ఎస్టీ వర్గాల మత్స్యకారులకు 40 శాతం రాయితీతో, మిగిలిన మత్స్యకారులకు 60 శాతం రాయితీతో చేపపిల్లలు పంపిణీ చేయనున్నారు.

శిశుగృహ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

అనంతపురం సెంట్రల్‌: శిశుగృహలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ అరుణకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేనేజర్‌, సోషల్‌ వర్కర్‌, నర్సు, ఆరుగురు ఆయాలు (ఓసీ–3, ఎస్సీ–2, బీసీ 1), వాచ్‌మెన్‌, డాక్టర్‌ (పార్ట్‌ టైం) పోస్టులు భర్తీ చేయనున్నారు. డాక్టర్‌ పోస్టు మినహా మిగిలిన పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 8 నుంచి 14వ తేదీలోపు అందజేయాలి. పూర్తి వివరాలకు https://ananthapura mu.ap.gov.in/ వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

పోలీసులకు ఇరువురు మహిళల అప్పగింత

తాడిపత్రి రూరల్‌: పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చారన్నా అనుమానంతో ఇరువురు మహిళలను పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు. తాడిపత్రి మండలం అయ్యవారిపల్లిలో శుక్రవారం ఉదయం ఇరువురు మహిళలు పూసలు అమ్ముతూ చిన్నారులతో సన్నిహితంగా మాట్లాడుతుండడం గమనించిన స్థానికులు వారి వద్దకెళ్లి ఆరా తీశారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలతో దాట వేసే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చి ఫోన్‌ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.

ఇసుక రీచ్‌లో వాటా కోసం రచ్చ

యల్లనూరు: ప్రభుత్వ ఇసుక రీచ్‌లో వాటా కావాలంటూ ఓ టీడీపీ నేత దౌర్జన్యానికి దిగిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌, మరికొందరు యల్లనూరులోని చిత్రావతి నదిలో ఇసుక రీచ్‌ను ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. కొంత కాలంగా ఈ రీచ్‌లో తనకు వాటా కావాలంటూ మండల టీడీపీ కన్వీనరు దొడ్లో రామాంజనేయులు గొడవపడుతూ వస్తున్నాడు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఇసుక తరలిస్తామంటే కుదరదంటూ గురువారం అర్ధరాత్రి తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామకృష్ణ అక్కడకుచేరుకుని సర్దిచెప్పడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది. కాగా, ఈ విషయం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ దృష్టికి వెళ్లడంతో ఆమె ఇద్దరికీ సర్దిచెప్పిట్లుగా సమాచారం.

గొంతెండుతున్నా పట్టించుకోరా?

కుందుర్పి : వారం రోజులుగా తాగునీరు రావడం లేదని స్థానిక విద్యుత్‌ కాలనీ, కలిశప్ప గుట్ట కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం నిరసన తెలిపారు. వందలాదిమంది మహిళలు తరలిరావడంతో కెనరాబ్యాంకు కూడలిలో రెండు గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. తాగునీటి సమస్య ఉందని లిఖితపూర్వకంగా ఇచ్చినా పెడచెవిన పెడతారా అంటూ మండిపడ్డారు. తనను గెలిపిస్తే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన అమిలినేని సురేంద్రబాబు.. ఎమ్మెల్యే అయ్యాక దానిని మరచిపోయారన్నారు. వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో పోలీసులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాయంత్రం ఎంపీడీఓ మాధవి వచ్చి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement