కరోనా విలయతాండవం మొదలైన 2020 మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా
అనంతపురం అగ్రికల్చర్: కరోనా విలయతాండవం మొదలైన 2020 మార్చిలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఏపీలో అడుగుపెట్టడానికి భయపడ్డారు. చివరకు టీడీపీ నేతలు సైతం కనీసం ప్రజలకు నైతిక స్థైర్యం కల్పించలేక దాక్కున్నారు. లాక్‌డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయిన విపత్కర పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా, ముఖ్యంగా రైతులు, పేద వర్గాలకు అడుగడుగునా అండగా నిలబడి ‘నిజమైన పాలకుడి’గా వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు గత కొంత కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
ఉద్యాన రైతుల కోసం కిసాన్ రైలు
కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్లతో దేశవ్యాప్తంగా మార్కెట్లు బంద్ కావడంతో రూ.లక్షలు పెట్టుబడులతో పండించిన ఉద్యాన ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు పడుతున్న అవస్థలపై అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సకాలంలో స్పందించారు. ఎక్కడిక్కడ జిల్లాల పరిధిలో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారు. స్థానిక అమ్మకాలపై దృష్టి సారించి కనీస పెట్టుబడులకు ఢోకా లేకుండా రూ.1,400 కోట్లు విలువ చేసే 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు క్రయవిక్రయాలు సాగించడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి నేరుగా ఢిల్లీ, నాగపూర్, ఝాన్సీ, ఆగ్రా మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తులు తరలించే ‘కిసాన్ రైలు’ను 2020, సెప్టెంబర్ 9న ప్రారంభించారు. మొదటి రైలులో 14 వ్యాగన్ల ద్వారా 322 టన్నుల ఉద్యాన ఉత్పత్తులు తరలించారు. ఇందులో 213.5 టన్నుల టమాట, 75 టన్నుల అరటి, 20 టన్నుల చీనీ, 8 టన్నుల కర్భూజా, 3 టన్నుల మామిడి, 2.50 టన్నుల బొప్పాయి ఉన్నాయి. స్పెషల్‌బోగీ ఏర్పాటు చేయడంతో 11 మంది రైతులు, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సెర్ఫ్ శాఖల నుంచి 15 మంది అధికారులు కూడా రైలులో ఢిల్లీకి వెళ్లి అక్కడి మార్కెటింగ్ వ్యవస్థపై అధ్యయం చేయగలిగారు. అనంతరం 2020 సెప్టెంబర్ 19న 12 వ్యాగన్ల ద్వారా 240 టన్నులు, అదే ఏడాది అక్టోబర్ 12న 12 వ్యాగన్ల ద్వారా 276 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు కిసాన్‌రైలు ద్వారా తరలించారు. అందులో చీనీ, మామిడి, దానిమ్మ, అరటి, టమాట, ఉసిరి, కర్భూజాతో పాటు వేరుశనగ లాంటి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.
నాడు టన్ను చీనీ రూ.లక్ష!
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన చర్యల ద్వారా 2021, 2022, 2023, 2024లో జిల్లాలోని దాదాపు అన్ని రకాల ఉద్యాన ఉత్పత్తులకు ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ పెరిగింది. 2021లో చీనీ టన్ను ఏకంగా రూ.లక్ష ధర పలికింది. అలాగే అరటి టన్ను రూ.30 వేల మార్క్‌ను చేరుకుంది. టమాట కూడా ఒకానొక దశలో కిలో రూ.100కు చేరుకుంది. ఇలా వైఎస్ జగన్ హయాంలో మార్కెటింగ్ పరిస్థితులు మెరుగుపడడంతో ఉమ్మడి జిల్లా రైతులకు పూర్తి ఆర్థిక భరోసా దక్కింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యాన ఉత్పత్తులకు గిట్టుబాటు కరువైపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అరటిని రోడ్డున పారబోస్తున్న దుస్థితి నెలకొందంటే రైతుల పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
కష్ట కాలంలో రైతులకు అండగా నిలిచిన జగన్ సర్కార్
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యాన
రైతులకు అడుగడుగునా ప్రోత్సాహం
కిసాన్ రైలు ద్వారా ఢిల్లీ, నాగపూర్ మార్కెట్లకు జిల్లా ఉద్యాన ఉత్పత్తులు
కరోనా విలయతాండవం మొదలైన 2020 మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా


