జనవరి 1 నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ
● జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య
అపంతపురం టవర్‌క్లాక్: పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిపికెట్ల (డీఎల్‌సీ)ను జనవరి 1 నుంచి సమర్పించాల్సి ఉంటుందని, అంతకు ముందు సమర్పించిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక పెన్సనర్ల భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కడ ఉన్న తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు. స్థానికంగా ఉన్న వారు ఎస్టీఓ కార్యాలయం, మీ–సేవా సెంటర్లు, పెన్షనర్ల సంఘాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చునన్నారు. విదేశాల్లో ఉన్నవారు అక్కడి ఎంబసీ కార్యాలయంలో సర్టిఫై చేయించుకుని డీఎల్‌సీ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎస్టీఓకి వీడియో కాల్ చేసినా వారి డీఎల్‌సీ కూడా ఆమోదించబడుతుందన్నారు.అనారోగ్య పరిస్థితి లో ఉన్న వారు ఫిబ్రవరిలో ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే వారి ఇంటి వద్దకెళ్లి డీఎల్‌సీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెన్షనర్లను కోరారు. సమావేశంలో జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పెద్దన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప తదితరులు పాల్గొన్నారు.


